ఎడిటోరియల్ : చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న అసమ్మతి..స్వీప్ చేసేదెవరు ?

Vijaya

షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశంపార్టీలో అసమ్మతి రోడ్డున పడుతోంది. ఒకటి కాదు రెండు కాదు కనీసం 15 నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలపై అసమ్మతి తీవ్రస్ధాయిలో బయటపడుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అసమ్మతి బయటపడుతుండటంతో చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో సమస్యలు పరిష్కారం కావాల్సింది పోయి అంతకంతకు పెరిగిపోతుండటమే విచిత్రంగా ఉంది.

 

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలోని మూడు నియోజకవర్గాలు పాయకరావుపేట, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాల ఎంఎల్ఏలు వంగలపూడి అనిత, వాసుపల్లి గణేష్ కుమార్, ముత్యాల నాయుడు పై ద్వితీయ శ్రేణి నేతలు మండిపోతున్నారు. వీళ్ళకి టికెట్లిస్తే తాము పనిచేసేది లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో సమావేశాలు కూడా పెట్టుకుని టికెట్లివ్వకూడదంటూ తీర్మానాలు చేసి చంద్రబాబుకు పంపుతున్నారు.

 

రాజధాని గుంటూరు జిల్లాలో వినుకొండ ఎంఎల్ఏ, జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులుకి కూడా అసమ్మతి సెగలు బాగానే తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జీవికి టికెట్ ఇస్తే పార్టీ గెలవదని కూడా అసమ్మతి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. తమ మాటను కాదని జీవికె టికెట్ ఇస్తే తాము పనిచేసేది లేదని కూడా చెప్పేశారు. ఇక తాడికొండ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ కథ వేరు. ఎంఎల్ఏకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో అసమ్మతి నేతలు ఏకంగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. సమావేశాలు పెట్టుకుని టికెట్ ఇవ్వకూడదని తీర్మానాలు చేస్తున్నారు.

 

ప్రకాశం జిల్లాలోని పర్చూరు ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు భగ్గుమంటున్నారు. ఏలూరికి టికెట్ ఇస్తే తాము పని చేయమని మంత్రికే అల్టిమేటమ్ జారీ చేయటం విచిత్రంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు ఎంఎల్ఏ, మంత్రి కెఎస్ జవహర్ కు టికెట్ ఇస్తే ఓడిపోతారంటూ నియోజవకర్గంలో ర్యాలీలు తీసి మరి చెబుతున్నారు అసమ్మతి నేతలు. కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డలో ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ ఎప్పటి నుండో అసమ్మతి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా అనంతపురం జిల్లాలో ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో పోటీ నేతలను ప్రోత్సహిస్తు ఎంఎల్ఏలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

 

ఇప్పటికి బయటపడిన నియోజకవర్గాలివే. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి రోడ్డున పడతాయో తెలీదు. చంద్రబాబేమో వచ్చే ఎన్నికల్లో టిడిపి స్వీప్ చేస్తుందని చెబుతున్నారు.  తమ్ముళ్ళేమో అందుకు వ్యతిరేకంగా అసమ్మతంటూ రోడ్డున పడుతున్నారు. మరి రాబోయే ఎన్నికలను ఎవరు స్వీప్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: