ఆర్థిక రాజధాని ముంబాయిలో "అమరావతి బ్రాండ్ బిల్డింగ్" పనిలో చంద్రబాబు

భారత ఆర్థిక రాజధాని ముంబాయి కాస్మోనగరంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నిన్న తాజ్ పాలెస్‌ లో పారిశ్రామికవేత్తలకు అమరావతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమావేశానికి దాదాపు 70 కంపెనీల అధినేతలు సర్వోన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆతరవాత రతన్‌ టాటా, ముకేశ్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా తదితర భారత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి చర్చలు జరిపారు. 

రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వివరించారు. కొత్తగా రూపు సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ భారత్ లో అగ్రస్థానంలో ఉండాలని తను విజన్ రూపొందించుకున్నట్లు చంద్రబాబు నాయుడు వారికి తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో "బెస్ట్ డెస్టినేషన్‌" గా ఉండాలన్నది తమ ఏకైక లక్ష్యమని, దానికనుగుణంగా గడచిన నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి నమోదు చేస్తోందని అన్నారు. "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌" లో ఆంధ్రప్రదేశ్ గత నాలుగేళ్ళలో వరుసగా అగ్రస్థానంలో నిలిస్తోందన్నారు.  రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డ్‌ గురించి వివరించారు. "ప్రకృతి పరమైన సుదీర్ఘ తీరం, పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణం" తో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సుఖ జీవనానికి అనువైన లక్ష్యంగా మారనుందని అన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటికే 137 రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌ లో అందిస్తున్నామని వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.



విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, 
బెంగుళూరు- చెన్నై కారిడార్, 
కర్నూలు- చెన్నై కారిడార్ 



ఇలా వేర్వేరు "ప్రొడక్షన్ నోడ్స్" నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్, హెల్త్, పర్యాటక, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు ప్రత్యేక విధానాలు ఉన్నాయని, అభివృద్ధి చేసిన "భూ బ్యాంకు" అందుబాటులో ఉందని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరణతో కూడిన ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. "సౌర విద్యుత్ ఉత్పత్తి" కి ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్‌ లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని "లక్ష్యం" గా నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి వారికి స్పష్టం చేశారు.



"ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని రూపొందించగలమన్న నమ్మకంతో దేశవిదేశాలకు చెందిన ఎన్నోసంస్థలు రాజధానికి వస్తున్నాయి. ఎట్టి పరిస్థితు ల్లోనూ వారి విశ్వాసాన్ని వమ్ముచేయం. ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో అమరావతి నిలవడం తథ్యం. 2029 నాటికి ఈ నగరం అత్యంత సంతోషకరమైన నగరం అవుతుంది. 2050 నాటికి గ్లోబల్‌ డెస్టినేషన్‌గా మారుతుంది" పలుమార్లు చంద్రబాబు పారిశ్రామికవేత్తల సమావేశంలో నొక్కి వక్కాణించారు. 

"జారీ చేసిన గంటలోనే సిఆర్డిఏ విడుదల చేసిన అమరావతి బాండ్లు "ఒకటిన్నర రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌" అయ్యాయని ₹1300 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని అధిగమించి ₹2000 కోట్లు సమకూరడం చరిత్రాత్మక విజయమని, "రాష్ట్ర విభజన తర్వాత ఏపికి అద్భుతమైన రాజధాని నగరం లేదు. భూమి లేదు. రాజధానికోసం రైతులను ఒప్పించి 35వేల ఎకరాలు సమీకరించాం ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని రూపొందించగలమన్న నమ్మకంతో దేశవిదేశాలకు చెందిన ఎన్నో సంస్థలు రాజధానికి వస్తున్నాయి" అని తన లక్ష్యాన్ని విస్పష్టంగా వివరించారు. 



ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా "సైబరాబాద్‌" విషేషనగరం తీర్చిదిద్దిన తీరును, అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్‌-రింగ్‌ రోడ్డుతోపాటు ఒక్కొక్కటిగా మౌలికవసతులను మెరుగుపరచడం, ఐటీ పరిశ్రమల కేంద్రంగా హైదరాబాద్‌ ను తాను ప్రగతిపథంలో పరుగులు తీయించిన తన అనుభవాన్ని మరోసారి గుర్తుచేశారు. 

రాజధాని నిర్మాణం అనేది తనకు మాత్రమే దక్కిన అత్యంత అరుదైన అవకాశం అని, తనకున్న నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ విశేషానుభవంతో అమరావతిని అత్యుత్తమ "గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ" గా రూపొందించేందుకు తాను హోం వర్క్ చేస్తున్నానని. నిజంగా చెప్పాలంటే దాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తున్నానని, తమపై ఉన్న విశ్వసనీయత కారణంగా సింగపూర్‌ ప్రభుత్వం "అమరావతి నగర మాస్టర్‌-ప్లాన్‌" ను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందించిందని" అని తెలిపారు.



ఆంధ్రప్రదేశ్‌లో ఆతిధ్యరంగం, పర్యాటకరంగం, ఎలక్ట్రికల్‌-బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు టాటా గ్రూప్‌ను ఆహ్వానించారు. టాటా సంస్థ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి సీఎం ముంబైలో టాటా ఎక్స్‌పిరియన్స్‌ సెంటర్‌ను సందర్శించారు. టాటా గ్రూప్‌ సామాజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి కార్యక్రమాలపై ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు. 

వెల్‌స్పన్‌ గ్రూపు చైర్మన్‌ బాలకృష్ణ గోయెంకా తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. సేంద్రియ పత్తి సాగులో ఆంధ్రప్రదేశ్‌తో ఉమ్మడిగా పని చేయడానికి ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా 33 శాతం అధిక ఆదాయం పొందేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గోయెంకా వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో రావలసిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. 

గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు అక్టోబర్‌ 2వ తేదీనుంచి ప్రారంభం కానున్నా యని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్య క్రమాల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల, మున్సిపల్‌ మంత్రి నారాయణ, ముఖ్య మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాలశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, సీఎం ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, రాష్ట్ర ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణ కిశోర్, రియల్‌-టైం-గవెర్నెన్స్‌ సీఈవో బాబు అహ్మద్, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: