ట్రాఫిక్ జాముల నుంచే నూతనోద్యమం ఊపిరిపోసుకోదనే గారెంటీ ఎమీ లేదు!

అది జిహెచెంసీ నా? లేదా జనహననానికి ప్రోదిచేసి, వారి రక్తం పీల్చే జలగల వ్యవస్థనా?  నా వయసు ఇప్పుడు 60. నాకు 20 సంవత్సరాల వయసు నుండి హైదరాబాదు ను చూస్తున్నా. అనేక సార్లు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నాం నా స్నేహితులతో కలసి. ప్రత్యేక తెలంగాణా వస్తే నైనా ఆంధ్రాలోని పల్లెల్లా తెలంగాణా గ్రామాలు సుసంపన్నవంతం ఔతాయని భావించి కలలు కనే వాళ్ళం. బహు దూరం నడిచిన తరవాత జీవితంలో తెలంగాణా రాష్ట్రం ఏర్పడి కనులారా చూసిన తరవాత, పరిస్థితులు వ్యక్తుల స్వార్ధం చూశాక, తెలుస్తుంది తెలంగాణా వాసులెంతగా మోసపోయారో?  అని. ప్రజలు కొందరు ఆత్మ సమర్పణం చేసి సాధించిన తెలంగాణా నేడు ఒకేఒక కుటుంబానికి ఊడిగం చేస్తుంది. 





రాజకీయాలు ప్రక్కన బెట్టి చూస్తే నేడు భాగ్యనగరం నేడు 100% అభాగ్యనగరంగా మారిపోయింది. 2014 లో నగరం ఎంతో కొంత అద్భుతంగా ఉండేది. అద్భుతం ఎందు కన్నానంటే,అమెరికా రోడ్లతో పోల్చికాదు. 2017 (నేడు) ఉన్న రోడ్లను, 2014 రోడ్లతో పోల్చిచూస్తే ఆరోడ్లు అద్భుతమే కాదు. స్వర్గసమానం. వేలకోట్ల ఋణాలు పెరిగిపోతున్నా మహానగరం కాస్తా మహానరకంగా మారిపోతుంది. రహదార్లు మొత్తం నరకానికి దార్లయ్యాయి.




నగరంలో ఉన్న 1000 గొలుసు కట్టు చెరువులు నేడు 175 కుంటలుగా మిగిలి,  "నీటికి చోటులేక, వాటిని కబ్జా చేసిన వారితోనే సహజీవనం చేయటానికి గృహాలలోకి వీధుల గుండా ప్రవేశం చేస్తున్నాయి"  వీధులు సరస్సులవటం తో జనం కార్లు, బైకులు అమ్మెసి, మోటార్ పడవలు కొనుక్కొని, రోజూ ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. దీనికి ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖామంత్రి కెటిఆర్ ప్రజల ఆవేదనాపూరిత వినతులకు సమాధానముగా వీధుల్లోనుంచే జిహెచెంసి అధికార్లకు రోడ్డుపై ఒక్క గుంట ఉన్నా క్షమించమన్నట్లు నాటకీయ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మాటకారైన మన ప్రియతమ అధినేత ఏనాటికైనా పనులుచేసి రాజధానిని రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో కాని అభివృద్దిపథంలో గాని నడపగలరన్న నమ్మకం దాదాపుగా ప్రజల్లో సన్నగిల్లి పోతుంది.




జిహెచెంసి ఉద్యోగులు ప్రజాసేవకులు. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం ఆదేశాలిస్తే అమలు చేయక పోవటం అనేది ప్రభుత్వ అసమర్ధతైనా కావాలి,  "లోపూచి అండర్-స్టాండింగ్"  అయినా కావాలి.  అసమర్ధతతో  కాలం వెళ్ళబుచ్చుతున్నట్లుగా నైనా భావించాలి.

విశ్వనగర వాహన ప్రయాణం వల్ల మహిళలకు సుఖ ప్రసవం అవుతుంది. పురుషులకు నడుములు విరిగిపోతున్నాయి. దిన దినం గంటలు ఘడియల కొలది ప్రయాణంలో మనుషులే కాదు, వాహనాలు సహితం అలసి సొలసి మూలన పడుతున్నాయి. ట్రాఫిక్ జాముల్లో జనజీవనం దుర్భరమౌతుంది. హైదరాబాద్ నగర పాలిక అసమర్ధత వలన నగరం అద్వాన్నమైతే జీతమిచ్చి పైగా జీతాలు విపరీతంగా పెంచి కూడా పని చేయించుకోలేక పోవటం ప్రభుత్వ చేతగానితనం, లేదా అవినీతి, లంచాలు, అసమర్థత కారణంగానే మన రోడ్లు ఇంత దరిద్రంగా తయారయ్యాయి.



వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయి అనేది ఒక సాకు మాత్రమే. మన పొరుగు రాష్ట్రాలు  కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలో మనకన్నా అధిక వర్షాలు కురుస్తాయి. ఆ రాష్ట్రాల్లోని నగరాల్లో పట్టణాల్లో ఇంత ధారుణంగా రోడ్లు పాడవలేదు. కొన్నిచోట్ల చెక్కుచెదరలేదు. హైదరాబాద్ లో రోడ్స్ మీదే మురుగునీరు పారుదల వ్యవస్థ ఉనికిలో ఉంది. మురుగు నీటి ప్రవాహ వ్యవస్థ సరిగా లేక రోడ్ల పైనే మురుగునీరు ప్రవహిస్తూ వరదలతో గృహసముదాయాల్లోకి ప్రవహించటం అత్యంత దురదృష్టకరమైన అంశం. ప్రగతి భవన్ కు ఈ దురవస్థ కనిపించదు





హైదరాబాదులో ఈ మధ్య మాత్రమే అధిక వర్షపాతం రికార్డైంది. గత మూడుదశాబ్ధాల కాలంలో హైదరాబాద్ రోడ్లు, ప్రభుత్వం చెప్పినట్లు గత రెండేళ్లలో రోడ్ల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెబుతున్నా, రాష్ట్ర పురపాలక మంత్రి శ్రీ కేటిఆర్, రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ అనేక సార్లు రోడ్ల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసినా, పరిస్థితి కొద్దిగా కూడా మార్పు లేదు. గత మూడు దశాబ్ధాల కాలంలో ఏ ప్రభుత్వ పాలనలో కూడా కూడా రోడ్ల రహదారుల నిర్వహణ ఇప్పుడున్నంత అధ్వాన్నంగా మాత్రం లేవు. నాటి ప్రభుత్వాలు కనీసం ఈ మహానగర రహదార్లను రోడ్లను అద్భుతంగా నిర్వహిస్తూ వచ్చాయి.




తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకే భాగ్యనగరానికి ఈ దుస్థితి దాపురించింది.  కారణం ప్రభుత్వం కాని, అధికార్లు కాని జాతి సంపదను గంపగుత్తగా మేసేస్తూనైనా ఉండవచ్చు లెదా అసమర్ధ పాలన కూడా కారణం కావచ్చు. అధికారుల అలసత్వం, అసమర్ధత, అవినీతి, నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణమైతే జీతాలు తీసుకొని పనిచేసే ఉద్యోగులతో పని చేయించుకోవటం యజమానిగా ప్రభుత్వ బాధ్యత.




మాకిక మాటలతో కోటలు కట్టే ప్రభుత్వం అవసరం లేదంటున్నారు తెలంగాణా ప్రజలు. మాటలు వదలి చేతల బాట పట్టక పోతే అటు జిహెచెంసికి గాని,  ప్రభుత్వానికి గాని కాని రానున్న కాలములో తులసితీర్ధం పోసే కాలం దాపురించినట్లే. సమాధి కాక తప్పదు. "మరో ఉధ్యమం రూపు దిద్దుకోవటానికి 60 యేళ్ళు మాత్రం పట్టదని ట్రాఫిక్ లోనే ప్రజలు నిర్ణయం తీసుకునేలా ఉన్నారు". ట్రాఫిక్ లో నుంచే ఉద్యమానికి శ్రీకారం చుట్టుకునే అవకాశాని మరవద్దు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: