ఎడిటోరియల్ : సిన్మా స్టార్స్ పాలిటిక్స్..!

Vasishta

సినీనటులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో రాణించిన ఎంతో మంది నటులు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత.. లాంటి వారెందరో పాలిటిక్స్ ను శాసించినవారే. చిరంజీవి, పవన్ కల్యాణ్ .. లాంటివాళ్లూ రాజకీయాల్లో తమదైన ముద్రవేస్తున్నారు. రంగస్థలంపై తాము పోషించిన పాత్రలను నిజజీవితంలో పోషించేందుకు ఆరాట పడుతున్నారు. ఇందుకోసం నటనకు సైతం గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా కన్నడ విలక్షణ హీరో ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు.


సినిమాల్లో ఓ వెలుగువెలిగిన ఎంతో మంది రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయస్థాయిలో కూడా చక్రం తెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో పాలిటిక్స్ లోనే ఉంటానన్నారు. రజనీకాంత్ , కమలహాసన్ కూడా పాలిటిక్స్ లో ప్రవేశించేందుకు పావులు కదుపుతున్నారు. తాజాగా.. హీరో ఉపేంద్ర రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించాడు.


శాండల్ వుడ్ లో విలక్షణ పాత్రలు పోషించి తనదైన స్టైల్లో అభిమానులను అలరించిన ఉపేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. కొంతకాలంగా పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. బీజేపీలో చేరుతారని మొదట భావించినా.. చివరకు సొంతంగానే పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నాటకలోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.


ప్రజా నాయకుడిని .. ప్రజా కార్మికుడిని.. అనేది తన నినాదమని ఉపేంద్ర వెల్లడించారు. జన నాయక, జన సేవక, జన కార్మిక పేర్లలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసి పార్టీ పేరును ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపేంద్ర రాజకీయ పార్టీ ప్రకటన కర్నాటక పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు బీజేపీతో కలిసి పని చేస్తాడకున్నవారందరికీ ఉపేంద్ర ప్రకటన ఆశ్చర్యం కలిగించింది.


ఇక తమిళనాడులో కూడా సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీపై కొత్త లెక్కలు వినిపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసేందుకు రజనీకాంత్, కమల్ హాసన్ పోటీ పడుతున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు రజనీకాంత్ జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారు. ఓ శుభముహూర్తాన పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ తో సమావేశాలు నిర్వహించారు.


కమల్ హాసన్ కూడా రాజకీయ ప్రవేశానికి సిద్ధమంటున్నారు. ఇప్పటికే పాలిటిక్స్ పై హాట్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. జయలలిత హయాంలో తన సినిమాలను అడ్డుకోవడం ద్వారా చేసిన తప్పిదాలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు కమల్ హాసన్ సిద్ధమవుతున్నారు. పళనిస్వామి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కమల్ హాసన్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష డీఎంకే నుంచి మద్దతు లభిస్తుండడం కమల్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినీరంగాన్ని దశాబ్దంపాటు శాసించిన చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అయితే 18 స్థానాలు మాత్రమే దక్కించుకుని అభిమానుల ఆశలను వమ్ము చేశారు. అంతేకాదు.. కొంతకాలానికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి.. ఆంధ్రుల ఆత్మాభిమానంపై నీళ్లు చల్లారు. అయితే.. అన్నయ్య చిరంజీవితో సైద్ధాంతిక విభేదాలున్న పవన్ కల్యాణ్ తాజాగా జనసేన పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్టు చెప్పారు. అక్టోబర్ నుంచి పూర్తి స్ధాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.


సినీ తారల పార్టీల ఏర్పాటు ఎలా ఉన్నా రాజకీయాలు వేరు.. సినీ జీవితం వేరు అంటున్నారు విశ్లేషకులు. నిజజీవితాన్ని సినిమాగా తీయడం సులువేకానీ.. అదే సినిమా నిజజీవితంలో సాధ్యం కాకపోవచ్చని సూచిస్తున్నారు. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ చిరంజీవే.! సొంత నియోజకవర్గంలోనే మెగాస్టార్ చిరంజీవి ఘోరంగా ఓడిపోయారు. అలాగే తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి రజనీకాంత్ 2004 ఎన్నికల్లో మద్దతిచ్చి ఘోర అవమానానికి గురయ్యారు. ఆయన బలపరిచిన స్థానాల్లో ఒక్కరూ కూడా గెలవలేదు. అలాగే సొంతపార్టీలున్న విజయ్ కాంత్, శరత్ కుమార్ కూడా రాణించలేకపోయారు. మరి ఇప్పుడు ఉపేంద్ర పార్టీ కర్నాటకలో ఏమేరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: