ఎడిటోరియల్ : జాతి జనులను ఏకం చేసే జాతీయ చిహ్నాలు!

Vasishta

భిన్న మతాలు, కులాలు.. అయినా భారతదేశ ఐకమత్యాన్ని ఏ ఒక్కరూ శంకించలేరు. సుదీర్ఘ విస్తీర్ణం కలిగినా.. అన్ని ప్రాంతాలను ఏకం చేసేవి, రాష్ట్రాల మధ్య అడ్డుగోడలను తెంచేసేవి, గతాన్ని వర్తమానంతో బంధిస్తున్నవి జాతీయ చిహ్నాలే.! మన జాతీయ చిహ్నాల వెనుక ఎంతో అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన కథలున్నాయి. అవేంటో చూసేద్దామా..?

 

జాతీయ పతాకం – మువ్వన్నెల జెండా

కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుంది మన జాతీయ పతాకం. మధ్యలో నీలం రంగు అశోకచక్రం దర్శనమిస్తుంది. జాతీయ పతాక రూపశిల్పి మన తెలుగువాడే. మచిలీపట్నంకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. 1916లో సుమారు 30 ఆకృతులను పింగళి తయారుచేశారు. ఆయనకు ముందు, ఆ తర్వాత కూడా చాలా మంది పతాకాలను రూపొందించారు. అయితే 1921లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి రూపొందించిన పతాకాన్ని గాంధీజీ జాతీయ పతాకంగా ప్రతిపాదించారు. 1947, జులై 22న దీన్ని జాతీయ పతాకంగా అధికారికంగా ప్రకటించారు.

 

జాతీయ చిహ్నం - నాలుగు సింహాలు

బోధివృక్షం కింద జ్ఞానం చేసిన తర్వాత బుద్ధుడు తొలిసారిగా ప్రవపించిన నేల సారనాధ్. ఇక్కడ క్రీస్తుపూర్వం            250లో మౌర్య చక్రవర్తి అశోకుడు ఓ స్థూపం చెక్కించాడు. ఆ స్థూపంపై ఉన్న 4 సింహాలను జాతీయ చిహ్నంగా ఎంచుకుంది భారతదేశం. వాస్తవానికి నాలుగు సింహాల కింద బోర్లించి ఉండే కమలం ఉంటుంది. అయితే దాన్ని కాకుండా పైనున్న సింహాలను మాత్రమే తీసుకున్నారు. సింహాల కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో ఉంటుంది. మాధవ్ సాహ్ని దీన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు. ఈ నాలుగు సింహాల తలలు శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసాలకు ప్రతీకలు. 1950 జనవరి 26న నాలుగు సింహాలను జాతీయ చిహ్నంగా అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజముద్రిక ఇదే.

 

జాతీయ గీతం – జనగణమన

జనగణమనను రవీంద్రనాధ్ ఠాగూర్ రాశారు. 1911 డిసెంబర్ 22న తొలిసారి దీన్ని కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాడారు. 1919లో మదనపల్లెలో దీనికి బాణీ కట్టారు. బిసెంట్ థియోసాఫికల్ కళాశాల విద్యార్థులతో కలిసి రవీంద్రుడు దీన్ని ఆలపించారు. 52 సెకన్లపాటు ఉండే ఈ గీతాన్ని 1950 జనవరి 24న జాతీయ గీతంగా ఆమోదించారు.

 

జాతీయగేయం – వందేమాతరం

వందేమాతరం ను బంకించంద్ర ఛటర్జీ రాశారు. ఆయన రాసిన ఆనందమఠం నవల నుంచి దీన్ని తీసుకున్నారు. 1896 జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో తొలిసారి దీన్ని ఆలపించారు. తొలుత పాడింది రవీంద్రనాద్ ఠాగూర్. 1950లో దీన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం ఆమోదించింది.

 

జాతీయ పక్షి – నెమలి

నెమలిని 1963లో జాతీయ పక్షిగా గుర్తించారు. అందానికి, మార్మికతకు నెమలి పెట్టింది పేరు. మగ నెమలి పింఛం రమణీయత చూసి తీరాల్సిందే. 1972లో నెమలిని జాతీయ వన్యమృగ చట్టంకింద వేటాడడం నిషేధించారు.

 

జాతీయ నది – గంగానది

2008 నవంబర్ 5న గంగానదిని జాతీయ నదిగా ప్రకటించారు. హిమాలయాల్లోని గంగోత్రిలో భాగీరథి పేరుతో ప్రారంభమయ్యే గంగానది ప్రస్తానం బంగ్లాదేశ్ లో మహానది పేరుతో సముద్రంలో కలుస్తుంది. మన దేశంలో 40 శాతం మంది ప్రజలకు ఇది జీవనది. సుమారు 2510 కిలోమీటర్ల మేర ఇది ప్రవహిస్తుంది. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు దీని ఉపనదులు.

 

జాతీయ వృక్షం – మర్రిచెట్టు

మర్రిచెట్టుకు మన సంస్కృతి, సంప్రదాయలతో అవినాభావ సంబంధం ఉంది. దీన్ని వటవృక్షం అని కూడా పిలుస్తారు. మర్రి విత్తనం చాలా చిన్నది. కాని వృక్షం ఓ అద్భుతం. దాని ఊడలు భూమిలోకి చొచ్చుకెళ్లి చెట్టు మొదలేదో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మనదేశంలో గిన్నీసు రికార్డులకెక్కిన మర్రి చెట్లున్నాయి. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినప్పుడు 7 వేల మంది సైన్యం ఒక్క మర్రి చెట్టుకిందే విడిది ఏర్పాటు చేసుకున్నాడట. దీన్ని బట్టి మర్రి చెట్టు ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

జాతీయ పుష్పం – కమలం

స్వచ్ఛతకు ప్రతీక పుష్పం. కమలం అందానికి ప్రత్యామ్నాయ పదం. నీటిలోని బురద నుంచి నీటి ఉపరితలం వరకూ వచ్చి వికసిస్తుంది కమలం. అయితే ఎక్కడా దీనికి బురద అంటదు. అందుకే ఇది స్వచ్ఛతకు ప్రతీక. అందుకే కమలాన్ని మన జాతీయ పుష్పంగా ప్రకటించారు.

 

జాతీయ ఫలం – మామిడి పండు

భారతీయ సంస్కృతితో విడదీయరాని అనుబంధం కలిగిన ఫలం – మామిడి. మనదేశంలో వందకు పైగా రకాల మామిడి లభిస్తుంది. దేశంలో స్త్రీమూర్తికి ప్రతీకగా భావించే ఆమ్రపాలి దొరికింది మామిడి తోటలోనే.! మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రస్తుత బీహార్ లో లక్ష మొక్కలతో ఓ మామిడి తోటను పెంచేవాడట. మామిడి మొక్కలోని ప్రతి అంగం ఉపయోగకరమే.

 

జాతీయ ప్రతిజ్ఞ – భారతదేశం నా మాతృభూమి..

భారతదేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు.. అని నిత్యం పిల్లలు స్కూళ్లలో ప్రతిజ్ఞ చేస్తుంటారు. ఇది మొట్టమొదటి సారి మన విశాఖపట్నంలో చదివించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1963లో తొలిసారి విశాఖలోనే దీన్ని చదవారు. దీని రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు. ప్రస్తుత తెలంగాణలోని నల్లగొండ జిల్లా వాసి. 1962లో దీన్ని రాశారు. 1964లో బెంగళూరులో దీన్ని ప్రతిజ్ఞగా స్వీకరించారు. 1965 జనవరి 26 నుంచి దీన్ని అన్ని భాషల్లోకి అనువదించి చదువుతున్నారు.

 

జాతీయ కరెన్సీ - రూపాయి

రూపాయి సింబల్ ను ఇటీవలే భారత ప్రభుత్వం ఆమోదించింది. దేవనాగరి లిపిలోని ‘రా’ అనే అక్షరాన్నే రూపాయి గుర్తుగా ఎంపిక చేసింది. 2010 జూలై 15వ తేదీన ఈ సింబల్ కు భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

 

జాతీయ పంచాంగం – శకయుగపు కేలండర్

చైత్రమాసంతో ప్రారంభమయ్యే శకయుగపు పంచాంగాన్ని జాతీయ పంచాంగంగా గుర్తించారు. 1957 మార్చి 22న దీన్ని అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు గ్రెగేరియన్ కేలండర్ ను అనుసరించేవారు. అయితే ఇప్పుడు గ్రెగేరియన్ తో పాటు దేశీయ కేలండర్ ను కూడా అమలు చేస్తున్నారు.

 

జాతీయ మృగం – బెంగాల్ టైగర్

బెంగాల్ టైగర్ ను జాతీయ మృగంగా 1973లో భారత ప్రభుత్వం గుర్తించింది. రాజసం, శక్తి, సామర్థ్యాలకు బెంగాల్ టైగర్ ప్రతీక. టైగర్ ను మృగంగా గుర్తించిన తర్వాత పులుల సంరక్షణ పథకం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 23 టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఉన్నాయి.

 

జాతీయ నీటి జంతువు – డాల్ఫిన్

గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్ ను జాతీయ నీటి జంతువుగా గుర్తించింది భారత ప్రభుత్వం. ఇది అందానికి, స్వచ్ఛతకు ప్రతీక.

 

 జాతీయ క్రీడ – హాకీ?

మన జాతీయ క్రీడ హాకీ. ఒలంపిక్ క్రీడల్లో మనకు అత్యధిక పథకాలు లభించింది హాకీ ద్వారానే. అయితే హాకీ, కబడ్డీలలో ఏది జాతీయ క్రీడో తెలపాలంటూ ఓ వ్యక్తి సమాచారహక్కు చట్టం ద్వారా అడిగితే.. ఈ రెండింటిలో దేనికీ జాతీయ హోదా లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సో.. మనకు జాతీయ క్రీడ ఏదీ లేదు

 

జాతీయ మిఠాయి – జిలేబీ (అనధికారికం)

జిలేబీ కనిపిస్తే చాలు నోరూరిపోతుంది. చాలాచోట్ల జిలేబీని అనధికారికంగా నేషనల్ స్వీట్ గా పరిగణనిస్తారు. జిలేబీ ముస్లిం పాలకుల ద్వారా దేశంలోకి వ్యాపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: