సాక్షి మీడియా.. జగన్ సొంత మీడియా.. అసలు వైఎస్ ముందుచూపుతో ఈ మీడియా హౌజ్ ను ఏర్పాటు చేయడం వల్లే వైఎస్ జగన్ ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ సాక్షి పత్రిక, ఇంటర్ నెట్ ఎడిషన్లు వైఎస్ జగన్ వార్తలను జనంలోకి తీసుకెళ్లడంలో అంత చొరవ చూపుతున్నట్టు కనిపించడం లేదు.
అందులోనూ వివాదాస్పద విషయాల్లో .. జగన్ వాదన బలంగా వినిపించాల్సిన సమయంలోనూ జగన్ వార్తలక అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తాజాగా జగన్ ప్రధానిని కేసుల గురించే కలిశాడంటూ అధికార పార్టీకి కొమ్ముకాస్తుందని ఆరోపణలున్న ఆంధ్రజ్యోతి పతాక శీర్షికలో వార్త అదరగొట్టింది. దీనిపై స్పందించేందుకు మొదట్లో వైసీపీ నాయకులే కనిపించలేదు.
ఆ తర్వా మధ్యాహ్నానికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ వార్తను ఖండించారు. జగన్ ఫిబ్రవరిలో రాసిన లేఖను ఇప్పుడు చూపించారని విమర్శించారు. ఆంధ్రజ్యోతిని తమ పార్టీ బహిష్కరిస్తుందన్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఏకంగా జగన్ తెరపైకి వచ్చారు. ఆయన పూర్తిగా ఈ వివాదంపై సుదీర్ఘంగా స్పందించారు.
ఆ వార్తను ప్రముఖంగా ఉంచాల్సిన సాక్షి ఇంటర్ నెట్ ఎడిషన్ అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు. వెబ్ సైట్లు ప్రధాన వార్తలను స్లైడ్ రూపంలో ప్రదర్శించడం చాలా రోజుల నుంచి వస్తోంది. జగన్ ప్రెస్ మీట్ అనంతరం కూడా సాక్షి నెట్ మీడియా.. కరుణాకర్ ప్రెస్ మీట్ వార్తనే ప్రధానంశాల్లో ఉంచింది. జగన్ స్పందనను పక్కన పెట్టే చిన్నవార్తల్లో కలిపేసింది. ఇదేం చిత్రమో.