చంద్రబాబు సర్కారుకు సమస్యల మీద సమస్యలు వచ్చిపడుతున్నాయి. మొన్నటికి మొన్న కాపు గర్జన ఉద్యమం ఏపీ సర్కారును కొన్ని రోజులపాటు కుదిపేసింది. రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పద్మనాభం దీక్షకు దిగన సమయంలో.. ఆంధ్రాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల కోపానికి ఎక్కడ గురికావాల్సి వస్తుందోనని బాబు టీమ్ కంగారుపడిపోయింది.
మొత్తానికి కాపు మంత్రులను, నేతలను రాయబారం పంపి దీక్ష విరమింపజేసి చంద్రబాబు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలబడలేదు. తమ కోరికలను బాబు సీరియస్ గా తీసుకోవడం లేదంటూ ముద్రగడ మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. కేవలం కాపు సమస్యల పరిష్కారం కోసం అన్నట్టు కాకుండా ముద్రగడ రాజకీయ విమర్శలకు దిగడమూ విమర్శల పాలైంది.
ముద్రగడ పద్మనాభంపై మొదట్లో సాఫ్ట్ గా విమర్శలు చేసిన టీడీపీ నేతలు ప్రస్తుతం డోస్ పెంచేశారు.. నీ వెనుక జగన్ ఉన్నారని నేరుగానే ఆరోపిస్తున్నారు. దమ్ముంటే 3 నిమిషాల్లో సర్కారును కూల్చమని సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11 నుంచి మరోసారి ముద్రగడ పద్మనాభం దీక్షకు దిగబోతున్నారు. ఈ సవాల్ కు తోడు మరోవైపు మంద కృష్ణ మాదిగ కూడా విశ్వరూప యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
మాదిగల రిజర్వేషన్ కోసం చంద్రబాబు చిత్తశుద్ది చూపడం లేదంటూ మంద కృష్ణ మాదిగ ఏకంగా చంద్రబాబు స్వగ్రామం నుంచి విశ్వరూపయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ రెండు కుల ఉద్యమాల వెనుక జగన్ ఉన్నారని టీడీపీ నేతలు ఇప్పిటికే ఆరోపణలు ఉధృతం చేశారు. మరి ఈ రిజర్వేషన్ల పోరును చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.