గుప్త నిధులు కావాలా.. ఆ జిల్లాకు వెళ్లండి..!?

Chakravarthi Kalyan
ఫ్రీగా ఫినాయిల్ వచ్చినా వదలిపెట్టరు.. అలాంటిది బంగారు నిధులు కాస్త కష్టపడితే చాలు వస్తాయంటే ఎవరు మాత్రం కాదంటారు. కష్టపడకుండా నిధులు రావాలంటే అవి గుప్త నిధులే అయిఉండాలి. వేరే మార్గం లేదు. అవును ఇప్పుడు విశాఖ జిల్లాలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇదేదో పుకారో.. వదంతో అని కొట్టిపారేయకండి.. లేదా.. ఇలాంటివి చాలా విన్నాం ఎప్పుడూ దొరకిన పాపాన పోలేదని నిట్టూర్చకండి. 

ఎందుకంటే.. మా ఊళ్లో గుప్తనిధులు ఉన్నాయి.. వాటిని మేం తవ్వి తీసుకుంటామని ఎవరైనా ఎప్పుడైనా కలెక్టరుకు దరఖాస్తు పెట్టుకున్నారా.. అలా పెట్టుకోవాలంటే.. గుప్తనిధులు ఉండితీరాలన్న నమ్మకం ఉండాలి కదా. విశాఖ జిల్లాలో అదే జరిగింది. మాడుగుల మండలం ఒమ్మలిలో గుప్తనిధులు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అందుకే ఆ నిధి తవ్వుకుంటామంటూ వారు అమాయకంగా కలెక్టర్ కు ఉత్తరం రాశారు. 

ఐతే.. సర్కారు చట్టాల ప్రకారం.. భూమిలో ఉంటే గుప్తనిధులు ప్రభుత్వానికే చెందుతాయి. కాబట్టి కలెక్టర్ కూడా తనంతాను పర్మిషన్ ఇవ్వలేరు. అందుకే ఆయన ఆ సంగతేంటో చూడండంటూ రెవెన్యూ , పురావస్తు శాఖ అధికారులను పురమాయించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శించిన అధికారులు తవ్వకాలు జరిపారు. గ్రామస్తుల అనుమానాలకు తగ్గట్టుగానే అక్కడ కొన్ని వస్తువులు లభించాయి. 

ఇవన్నీ పురాతన బౌద్ధ అవశేషాలను అధికారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడో బౌద్ధారామం ఉండేదంటున్నారు. ఏదేమైనా ఆ గ్రామంలో గుప్త నిధి ఉందని గ్రామస్తులు గాఢంగా నమ్ముతున్నారు. అధికారులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా తవ్వకాలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో దొరికిన విలువైన రంగురాళ్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: