వర్క్ ప్రెజర్ చంపేస్తోంది కార్పొరేట్ లైఫ్ నిజం ఇదే!

Amruth kumar
సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలు, విలాసవంతమైన జీవితం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, ఆ జీతం వెనుక ఉన్న ఒత్తిడి, కోల్పోతున్న ఆరోగ్యం గురించి ఒక టెక్కీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. వర్క్‌ప్లేస్ డిస్కషన్ యాప్ 'బ్లైండ్' (Blind) మరియు 'రెడిట్' వేదికగా సదరు ఉద్యోగి పంచుకున్న ఆవేదన ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.



ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక బ్యాకెండ్ డెవలపర్ తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఏడాదికి రూ. 30 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నప్పటికీ, తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అతను పేర్కొన్నాడు.గత 5 ఏళ్లుగా ఒకే డాక్టర్ వద్దకు వెళ్తున్న సదరు టెక్కీకి, ఈసారి డాక్టర్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. "నీ బాడీ గ్రాఫ్ చూస్తుంటే నీ ఉద్యోగ ఒత్తిడి నీ శరీరంపై స్పష్టంగా కనిపిస్తోంది. నీకు వీలైతే వెంటనే బ్రేక్ తీసుకో.. లేదంటే 40 ఏళ్లకే గుండె సంబంధిత సమస్యలు రావడం ఖాయం" అని డాక్టర్ చెప్పారట.ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే విపరీతమైన గుండె వేగం , ఎప్పుడూ ఏదో కీడు జరుగుతుందనే భయం, నిరంతర తలనొప్పి మరియు నీరసం తనను వేధిస్తున్నాయని ఆ టెక్కీ తెలిపాడు.పండుగ రోజుల్లో కూడా పని చేయాల్సి రావడం, జబ్బు పడినా సరే లీవ్ ఇవ్వకుండా 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయమనడం వంటి కారణాలతో తాను తీవ్రమైన బర్నౌట్ కు గురయ్యానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.



ఈ పోస్ట్ చూసిన మరికొందరు టెక్కీలు కూడా తమ చేదు అనుభవాలను పంచుకుంటున్నారు: "డబ్బు ఉంది కానీ, 32 ఏళ్లకే ఆరోగ్యం లేదు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఏ ఉద్యోగమూ మీ ప్రాణం కంటే ముఖ్యం కాదు" అని మరొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో, ఆరోగ్యం దెబ్బతింటున్నా సరే ఉద్యోగం వదలలేక నరకం అనుభవిస్తున్నామని చాలామంది వాపోతున్నారు.బెంగళూరుకు చెందిన మరో టెక్కీ, తన సీఈఓ తిట్టిన తిట్లకు వీడియో కాల్‌లోనే కుప్పకూలిపోయి ఆసుపత్రి పాలైన ఘటన కూడా ఇటీవల వైరల్ అయ్యింది.



"పని కోసం బ్రతకకండి.. బ్రతకడం కోసం పని చేయండి" అనే సూత్రాన్ని కార్పొరేట్ కంపెనీలు మర్చిపోతున్నాయని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. భారీ జీతం వస్తున్నా అది మందులకే సరిపోతుంటే, ఆ ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: