హైదరాబాద్ : అధిష్టానాన్నే ఆటాడుకుంటున్న ఎంపీ

Vijaya






కాంగ్రెస్ పార్టీలో పూర్తిప్రజాస్వామ్యం ఉంటుంది అనటానికి ఇంతకుమించిన ఉదాహరణ మరొకటుండదు. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతికి చేయాల్సినంత డ్యామేజి చేసేశారు. పట్టుబట్టి స్రవంతికి టికెట్ ఇప్పించుకున్న వెంకటరెడ్డి తర్వాత అడ్రస్ లేకుండాపోయారు. బీజేపీ తరపున పోటీచేసిన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకు అన్నీరకాలుగా ప్రయత్నాలుచేశారు.



తమ్ముడి గెలుపుకు సొంతపార్టీ ఇమేజీనే కాకుండా అభ్యర్ధి స్రవంతి గెలుపును కూడా పణంగా పెట్టారు. పార్టీని ఇంతగా వెన్నుపోటుపొడిచిన వెంకటరెడ్డి ఆస్ట్రేలియా నుండి బుధవారం తిరిగొచ్చారు. కాంగ్రెస్ లో ఉంటునే బీజేపీ అభ్యర్ధికి పనిచేయాలని మద్దతుదారులను ఒత్తిడిపెడుతున్న విషయం బయటపడింది. దాంతో అధిష్టానం ఎంపీకి షోకాజ్ నోటీసిచ్చింది. మరి దానికి సమాధానం ఇచ్చారో లేదో తెలీదుకానీ తాను మాత్రం ఏతప్పూ చేయలేదంటున్నారు.



తనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన నేతలు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆయనకు క్లీన్ చిట్ ఇస్తేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానంటు షరతులు పెట్టడమే విచిత్రంగా ఉంది. తన మద్దతుదారులతో మాట్లాడుతు తమ్ముడి గెలుపుకు సాయం చేయాలని అడిగిన మొబైల్ ఆడియోలు నియోజకవర్గంలో వైరల్ అయ్యాయి. ఆ ఆడియో విషయంలో తనకు క్లీన్ చిట్ ఇవ్వాలని ఎంపీ  డిమాండ్ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. పార్టీని చేయాల్సినంత కంపు చేసేశారు. ఇక కొత్తగా కంపుచేయటానికి ఎంపీకి ఏమీ మిగలలేదు.



అయినా సరే తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఎంపీపైన కచ్చితంగా వేటు ఉంటుందనే ప్రచారమైతే జరుగుతోంది. నిజానికి ఇపుడు కూడా వెంకటరెడ్డిపైన యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు ఎంపీనే ఆదర్శంగా తీసుకుంటారనటంలో సందేహంలేదు. తనపైన యాక్షన్ తీసుకుంటే వెంటనే రాజీనామా చేసి బీజేపీలో చేరుదామని ఎంపీ అనుకుంటున్నట్లున్నారు. తమ్ముడి గెలుపుపైనే అన్న భవిష్యత్తు ఆధారపడుంది. తమ్ముడు గెలిస్తే వెంటనే అన్నకూడా అదేదారిలో వెళతారు. ఒకవేళ ఓడిపోతే ఏమిచేయాలో అప్పుడే ఆలోచించుకుంటారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: