రాయలసీమ : కుప్పంలో జగన్ కాలుపెడుతున్నారా ?

Vijaya


అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబునాయుడు అడ్డా కుప్పంలో కాలుపెడుతున్నారా ? అవుననే చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఈనెల 22వ తేదీన జగన్ కుప్పంలో పర్యటించబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్ధాయిలో సమీక్ష చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే కుప్పంలోనే భారీ బహిరంగసభకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఇక్కడ ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా తనకు ఎదురులేదన్నట్లుగా ఉన్న వ్యవహారం కాస్త 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ఎదురుతిరుగుతున్నది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమిభయం పట్టుకున్నది. ఇందుకనే గడచిన 35 ఏళ్ళల్లో చంద్రబాబు ఏడాదికి ఒకసారి వస్తే అదే గొప్పన్నట్లుగా ఉండేది. కానీ స్ధానికసంస్ధల్లో పడిన దెబ్బ తర్వాత ఇపుడు ప్రతి రెండునెలలకు మూడురోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడుతారో లేదో తెలీదుకానీ ఓటమి భయమైతే బాగా కనబడుతోంది. ఆ భయాన్ని చంద్రబాబులో అలాగే మైన్ టైన్ అయ్యేట్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగమే కుప్పంలో జగన్ పర్యటన. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం మున్సిపాలిటి అయ్యింది. అలాగే కుప్పం రెవిన్యు డివిజన్ అయ్యింది. కుప్పం మున్సిపాలిటి డెవలప్మెంట్ కు రు. 65 కోట్లు విడుదలయ్యాయి.
ఇదే సందర్భంలో నియోజకవర్గం మొత్తం సంక్షేమపథకాలను మంత్రి పక్కగా అమలయ్యేట్లు చూస్తున్నారు. ప్రభుత్వం తరపున ఎంఎల్సీ భరత్ రెగ్యులర్ గా నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తొందరలోనే జగన్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. జగన్ పర్యటనతో పార్టీకి మరింత ఊపురావటం ఖాయమని పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. మరి సీఎం పర్యటన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది ఆసక్తిగా మారింది. టీడీపీలో నుండి వైసీపీలోకి ఏవైనా చేరికలుంటాయేమో అని అనుకుంటున్నారు. మరి ఎవరెవరు చేరుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: