అందుకే మోదీ సభకు వెళ్లలేదు.. పవన్ క్లారిటీ..

Deekshitha Reddy
ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోదీతో కలసి పాల్గొనే అవకాశం వచ్చినా తాను వెళ్లలేదని దానికి కొన్ని కారణాలున్నాయని చెప్పారు పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు ఆయన ఈ విషయంలో నోరు మెదపలేదు. జనసేన నుంచి కూడా క్లారిటీ రాలేదు. కానీ తొలిసారిగా ఆయన పెదవి విప్పారు. తాను వెళ్లలేకపోవడానికి కారణం చెప్పారు. ఆ కారణం వింటే మాత్రం పవన్ పై జాలి కలగకమానదు. జనసైనికులు ఆయన మాటలు విని చప్పట్లు కొట్టారు కానీ, జనసేనాని ప్రధాని సభకు వెళ్లలేకపోవడానికి కారణం స్థానిక ఎంపీనా అని మాత్రం ఆశ్చర్యం వేస్తుంది.
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పీఎం మోదీ, సీఎం జగన్, రాష్ట్ర మంత్రులు, చిరంజీవి ఇలా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే  ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగేలా చేసింది. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పవన్‌ కల్యాణ్‌ ఆ సభకు వెళ్లలేదు. బీజేపీతో జనసేనకు గ్యాప్ వచ్చిందా అనే అనుమానం కూడా మొదలైంది. ప్రధాని సభలో ఎందుకు పాల్గొనలేదనే దానిపై అప్పట్లో జనసేన నుంచే రకరకాల వాదనలు బయటకొచ్చాయి. తాజాగా భీమవరంలో పర్యటించిన పవన్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించి అక్కడ జనవాణి కార్యక్రమం జరిపారు, ఆ తర్వాత ప్రధాని కార్యక్రమంలో తాను ఎందుకు పాల్గొనలేకపోయాననే విషయాన్ని బయటపెట్టారు.
భీమవరంలో ప్రధాని సభకు జనసేన తరపున తనకు కూడా ఆహ్వానం అందిందని, అయితే కేవలం స్థానిక ఎంపీ రాలేదనే కారణంతోనే తాను హాజరు కాలేదని చెప్పారు. స్థానిక ఎంపీకి ఆహ్వానం లేనప్పుడు  తాను ఆ సభకు వెళ్లడం సరికాదే ఉద్దేశంతోటే దూరంగా ఉన్నట్టు వివరించారు. అంతేకాదు రఘురామకృష్ణంరాజుని ఓ రేంజ్ లో వెనకేసుకొచ్చారు పవన్. ఆయనపై వైసీపీప ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, సొంత నియోజకవర్గానికి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో మీకు ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఆ ఎంపీకి అవమానం జరుగుతోందని అందుకే తాను కూడా ఆ సభకు రాకుండా దూరంగా ఉన్నానని చెప్పారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: