టీడీపీ నేత గురించి గొప్పగా చెప్పిన మంత్రి రోజా..

Deekshitha Reddy
పార్టీ వేరు, అభిమానం వేరు. అందుకే తాను అభిమానించే, తనకు సినీ, రాజకీయ జీవాతాన్నిచ్చిన వ్యక్తిని మంత్రి రోజా తలచుకోకుండా ఉండలేకపోయారు. ఆయనే దివంగత నేత శివప్రసాద్. మాజీ ఎంపీ. తుది శ్వాస వరకు టీడీపీతోనే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, తనకు పదవి ఉన్నా లేకపోయినా ఆయన పక్కా టీడీపీ. అయినా కూడా రోజా ఆయన గురించి గొప్పగా చెప్పారు. అంతెందుకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అంటే చాలామందికి అభిమానం, కానీ ఇతర పార్టీల్లో ఉన్న కొంతమంది మాత్రమే బహిరంగంగా తాము ఎన్టీఆర్ అభిమానులం అని చెప్పుకుంటారు. ఇప్పుడు రోజా కూడా అలాగే దివంగనేత శివప్రసాద్ ని స్మరించుకున్నారు.
సినీ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు రోజా. ముందు టీడీపీలో ఉన్నా.. ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా చేపట్టారు. తనను సినీరంగంలోకి తీసుకు రావడమే కాకుండా, ఆ తర్వాత రాజకీయాల్లోకి తీకొచ్చింది కూడా శివప్రసాదేనని చెబుతుంటారు రోజా. ఇప్పటికా చాలా సందర్భాల్లో ఆయనను గుర్తు చెేసుకున్న రోజా.. మరోసారి మంత్రిగా ఆయన పేరు ప్రస్తావించారు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ లో మంత్రి రోజాను ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోజా శివప్రసాద్ ని గుర్తు చేసుకున్నారు. తనను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆయనేనని చెప్పారు.
తన మంత్రిత్వ శాఖపై కూడా రోజా మాట్లాడారు. తిరుపతిలో టూరిజం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు రోజా. టూరిజంలో హోటళ్లది ముఖ్య పాత్ర అని, కరోనా వల్ల హోటల్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు రోజా. తిరుపతి జూ పార్క్ లో ఎలక్ట్రిక్ వాహనాలను పునరుద్ధరించేందుకు, కొత్తవాటిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు రోజా. చంద్రగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఏపీ టూరిజంకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోటా పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు.
ఏపీలో పర్యాటక యాప్..
ఏపీలో అన్ని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం, హోటళ్ల సమాచారం, ఇతర ప్రయాణ సౌకర్యాల సమాచారాన్నంతా ఒకే యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటున్నారు రోజా. పర్యాటక రంగం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: