అమరావతి : ఆయుధం లేకుండా యుద్ధానికి రెడీ అవుతున్నారా ?

Vijaya



గుడివాడకు సంబంధించి తెలుగుదేశంపార్టీ విచిత్రమైన పరిస్దితిని ఎదుర్కొంటోంది. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని చంద్రబాబునాయుడు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఓడించాలని బలంగా అనుకుంటున్నారు కానీ ఎలా ఓడించాలో మాత్రం తెలీటం లేదు. గుడివాడలో నానిని ఢీ కొనేంత సీన్ ఉన్న నేతలు ఎవరూ లేరనే చెప్పాలి. నియోజకవర్గంలోని నేతలు కూడా కొడాలికి వ్యతిరేకంగా పోటీ చేయటానికి ముందుకు రావటంలేదు.



వరుసగా నాలుగు ఎన్నికల్లో కొడాలి గెలుస్తునే ఉన్నారు. రెండుసార్లు టీడీపీ నుండి మరో రెండుసార్లు వైసీపీ తరపున గెలిచారు. నిజానికి ఈ నియోజకవర్గం కమ్మోరి నియోజకవర్గమని పేరుంది కానీ ఇక్కడ బీసీలే ఎక్కువే. నాని కూడా కేవలం కమ్మ అని కాకుండా అన్నీ సామాజికవర్గాల్లోను పాతుకుపోయున్నారు. అందరికీ అందుబాటులో ఉండే నేతగా, నియోజకవర్గాన్ని డెవలప్ చేయటంలో కూడా ముందుంటున్నారు. దాంతో నాని అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు.



ఈ నేపధ్యంలో కొడాలిని ఓడించటం అంటే మామూలు విషయంకాదు. పైగా ప్రతిపక్షాల్లో గట్టి అభ్యర్ధులే లేరు. అందుకనే ఎన్టీయార్ కుటుంబసభ్యుల్లో ఎవరినైనా పోటీకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం హిందుపురం ఎంఎల్ఏ గా ఉన్న బాలకృష్ణను కానీ లేదా ఇంకెవరినైనా కానీ పోటీకి దింపాల్సిందే అని నేతలు కూడా గట్టిగా చెబుతున్నారట. కొడాలి మీద పోటీకి బాలకృష్ణ రెడీ అంటారా అన్నది డౌటే.  గుడివాడలో పోటీ అంటే  సినిమాల్లో విలన్లపైన తొడలు కొట్టినట్లు కాదు. ఓడిపోతే నందమూరి ఫ్యామిలితో పాటు చంద్రబాబు+టీడీపీ పరువంతా పోతుంది.



ఇదే సమయంలో ఓడిపోతే కొడాలికి పోయేదేమీ లేదు. ఎందుకంటే కొడాలిని ఓడించటానికి ఇంతమంది ప్రత్యర్ధులు ఏకమవ్వాల్సొంచ్చిందా అనే చర్చ జరుగుతుంది. కాబట్టి గెలిచినా, ఓడినా కొడాలికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఒకసారి జనసేనతో పొత్తుంటే ఎలాగుంటుంది ? లేకపోతే ఎన్టీయార్ ఫ్యామిలీని దింపితే ఎలాగుంటుందనే టాక్ పార్టీలో బాగా జరుగుతోంది. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఆయుధాలు లేకుండానే యుద్ధానికి రెడీ అవుతున్నట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: