బీజేపీ స్పీడు పెంచ‌డానికి కార‌ణం అదేనా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలోగా జ‌ర‌గాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో దృష్టి సారించి అక్క‌డి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్యూహాలు అనుస‌రిస్తూ ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ‌మంతా ఆ ప‌నిలోనే కొంత‌కాలంగా మునిగిపోయి ఉంది. ఆ ఎన్నిక‌లు పూర్త‌య్యాక ద‌క్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌పైన దృష్టి సారించే అవ‌కాశ‌మున్న‌ట్టు ముందునుంచే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే ఉన్న‌ట్టుండి కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు పెంచింది. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల‌తోపాటు ఇక్క‌డ కూడా జనంలోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఆ పార్టీకి బ‌ల‌ముంద‌ని భావిస్తున్న‌తెలంగాణ‌లోనే కాక ఇప్ప‌టిదాకా కాస్తైనా బ‌లం ఉంద‌ని నిరూపించుకోలేకపోయిన ఏపీలో సైతం ప్ర‌జాగ్ర‌హ స‌భ పేరుతో మీటింగ్ పెట్టింది. ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్ర‌త్యక్ష యుద్ధం ప్ర‌క‌టించిన స్థాయిలో చెల‌రేగిపోతోంది.

 
తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన 317 జీవో ఉద్యోగుల‌కు వ్య‌తిరేక‌మంటూ నిర‌స‌న తెలుపుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్టు చేయ‌గా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హుటాహుటిన‌ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. పార్టీ కార్యాల‌యంలో ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్‌ నియంతృత్వ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌తామ‌ని, ధ‌ర్మయుద్ధంలో గెలిచేది తామేన‌ని ప్ర‌క‌టించారు. కాగా ఈ ఉదంతంలో బండి సంజ‌య్ అరెస్టు మొద‌లు.. బీజేపీ అధ్య‌క్షుడు జేపీ నడ్డాను విమానాశ్ర‌యంలోనే ఆపేందుకు తెలంగాణ పోలీసులు  విఫ‌ల‌య‌త్నం చేయ‌డం వ‌ర‌కు, అంత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఏమిటో కొరుకుడు ప‌డ‌నిదే. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బీజేపీని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో భాగంగానే ప‌ర‌స్ప‌రం  ఉత్తుత్తి పోరాటాలు చేసుకుంటున్నాయ‌ని, వారి ఆట‌లు తెలంగాణ‌లో సాగ‌నివ్వ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉత్త‌రాదిన ఎన్నిక‌లు ముగిశాక తెలంగాణ‌, ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల్లోనూ రాహుల్‌, ప్రియాంక విస్తృతంగా ప‌ర్య‌టించి కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధ‌మైంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసే లక్ష్యంతో బీజేపీ ఈ రాష్ట్రాల‌పైనా కన్నేసింద‌ని కాంగ్రెస్ నాయ‌కుల విశ్లేష‌ణ‌. మ‌రి ఇందులో ఏమేర‌కు వాస్త‌వ‌ముందో వ‌చ్చే కొద్దిరోజుల్లో తేల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: