ఇటు పిల్లలకు ట్రయల్స్.. అటు ఆ ట్యాబ్లెట్లతో ఉపశమనం..!

NAGARJUNA NAKKA
రెండు నుండి 18ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. ఈ వయసు వారి కోసం తాము రూపొందించిన కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఉత్తమ ఫలితాలు వచ్చాయనీ.. పిల్లల్లో 1.7రెట్లు యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదని భారత్ బయోటెక్ ప్రకటించింది.
కోవిడ్ రోగుల చికిత్సలో మోల్నుపిరవిల్ ట్యాబ్లెట్లు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఇస్తున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వీటికి అమెరికా, యూకే, భారత్ ఆమోదం తెలపడంతో వారంలో ఉత్పత్తి ప్రారంభించేందుకు దేశీయ ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఆయా బ్రాండ్ ను బట్టి 200ఎంజీ క్యాప్సూల్ 40 రూపాయల నుంచి 70రూపాయల వరకూ ఉంటుంది. వరుసగా ఐదు రోజుల్లో మొత్తం 40క్యాప్యూల్స్ వాడితే గరిష్టంగా అయ్యే వ్యయం 2వేల 800 రూపాయలు మాత్రమే.
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న 8రాష్ట్రాలు అనగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఝార్ఖండ్, గుజరాత్, హర్యానాను హెచ్చరించింది. ఈ రాష్ట్రాల్లోని 14నగరాల్లో కరోనా ఉధృతి అధికంగా ఉందని తెలిపింది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కొత్త ఏడాది వేడుకలపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలంది.
దేశంలో కొద్ది రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలోని 22రాష్ట్రాల్లో 961 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. అందులో 320మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపింది. ప్రస్తుతం 641మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారంది. అత్యధికంగా ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252కేసులు నమోదయ్యాయి. మొత్తానికి వైరస్ ను దరిచేరనీయకుండా ఉండేందుకు ఫార్మాకంపెనీలు గట్టిగానే కృషి చేస్తున్నాయి. అటు ప్రజలు కూడా వ్యాక్సిన్ విషయంలో పాజిటివ్ గా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: