కేంద్ర మంత్రిపై ధ్వజమెత్తిన రాష్ట్ర మంత్రి అనిల్.. ఎందుకంటే..?

Deekshitha Reddy
వైసీపీ జోలికొచ్చినా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అన్నా విరుచుకుపడే మంత్రి అనీల్.. తాజాగా మరోసారి ఫైర్ అయ్యారు. అయితే ఈ సారి ఆయన ఫైర్ అయింది టీడీపీ నేతలపైనో.. జనసేన నాయకులపైనో కాదు. ఏకంగా కేంద్ర జలశక్తిమంత్రిపైనే ధ్వజమెత్తారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై పార్లమెంట్ లో విమర్శలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు విషయంలో విఫలమయ్యారని అన్నారు. ఐదవగేటు ఎత్తకుండా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అనీల్ స్పందించారు. నేరుగా కేంద్ర జలశక్తి మంత్రితోనే ఢీ కొట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో వరద బీభత్సం జరిగి అల్లాడుతుంటే.. ఇవేమీ తెలియకుండా కేంద్రమంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి అనీల్. వరద ప్రవాహం ప్రాజెక్ట్ కెపాసిటీ కంటే ఎక్కువగా రావడం వలనే వరద కట్టలు తెంచుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లోనూ ఇటువంటి ఘటనే జరిగిందని గుర్తు చేశారు. దాదాపుగా 150మంది ఆ సంఘటనలో మరణిస్తే కనీసం బీజేపీ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీలో జరిగిన చిన్న తప్పిదాన్ని కావాలనే రాజకీయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యల వెనుక సుజనా చౌదరి, సీఎం రమేష్ సృష్టించిన కాకమ్మ కధలే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీలో పనిచేసిన వారి మాటలు విని ఏపీ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని చెప్పారు.
ఏపీలో భారీ వరదలు ఇటీవల విలయాన్ని సృష్టించాయని.. ఒకవేళ అన్నమయ్య ప్రాజెక్ట్ ఐదవ గేటు ఎత్తినా వరద ఉధృతిని ఆపలేక పోవచ్చని అన్నారు. ఈ విషయాలన్నీ స్థానిక కలెక్టర్ ను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని కనీసం వివరణ కూడా అడగకుండానే ఇలా పార్లమెంట్ లో పరువు తీయడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా రాజకీయాలకు వాడుకోవడంపైనా మండిపడ్డారు. ఒకవైపు ఇప్పటికే టీడీపీ నేతలు రాష్ట్రంలో తమ పార్టీపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని.. మరోవైపు ఇప్పుడు బీజేపీ నేతలు కూడా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మొత్తానికి మంత్రి అనీల్ ఇలా కేంద్రమంత్రిపైనే విమర్శలు చేయడం మాత్రం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: