వెల "సిరి" : తెలుగు పాట ఆఖరి నిబద్ధాక్షరి సీతారామ శాస్త్రి

RATNA KISHORE
జనించిన శిశు గళం ఇంకా వినిపిస్తోంది..
చేయి పట్టుకుని నడిపిన నాన్న గుణం ఇంకా గుర్తుకువస్తోంది
పాట ఒంటరిని చేసి పోతోంది నన్ను
అదే కన్నీటి ఊట ఇంకో గమన రీతిని పరిచయం కాకుండానే ఉంచుతోంది
గాలి పల్లకీలో తరలిన పాటలే ఆయనకు వేదనలు అయి ఉంటాయి
ఇప్పుడు మరలి రాని పాటలు ఏమయినా ఉన్నాయా?
కవికి స్థిర స్థానం చదువరి హృదయ పీఠం..
అక్కడి నుంచి వినిపించే గొంతుకే
రేపటి కవులకు దిశానిర్దేశాలు...
తిక్కలమారితనం మనిషిలో ఉంటుంది.. రాకాసి రావణున్ని కోవెల్లో ఖైదు చేసిన గుణం కూడా మనలోనే ఉంటుంది.. కథ కు రెండు మూడు మాటలు తోడయి మంచి అర్థం ఇవ్వగలిగితే రెండు మూడు వాక్యాలు పాటల్లో తోడుండి గొప్ప అన్వయాన్ని ఇస్తాయి. అలాంటి కథను నడిపే నిబద్ధాక్షరి ఆయన.. పాట ను చీకటి నుంచి వెలుగు దిశగా నడపగలిగే గొప్ప శక్తి ఆయన..ఆ క్రమంలో తనని తాను సంస్కరించుకున్న మంచి మనిషి కూడా! ఈ పాట చీకటి ఈ పాట వెలుగు అని విడదీయలేం కానీ చీకటిని వద్దన్న వెలుగు కొన్నింట నిర్వచిత స్థానాలు ఇచ్చి వెళ్లింది.. అలాంటి వెలుగుల ఝరి చెంత ఆయన పాట విశేషార్థం అయింది. 


సీతారామ శాస్త్రిలో ఉన్న రామ శబ్దం కారణంగా ఆయన చాలా మందికి ఇష్టం అయిపోయి ఉంటారు. అందరినీ కలుపుకునే గుణం ఒక్క రాముడిలోనే ఉందని అంటారే! అలాంటి రామయ్య కొన్నింట వాగ్బాణాలు సంధించారు. మంచి పాటలు రాసి గుణం లోనూ నడవడిలోనూ దోష సంహరణ చేశారు. మంచి వారు ఆయన.. మంచి ప్రతిభ ఉంటే నెత్తిన పెట్టుకునే శివుడు ఆయన.. మనిషి భోళా! ఏం చెప్పినా సూటిగానే ఉంటూ కటువుతనం ఆపాదించుకుని ఉంటుంది. పాట రాసినా అంతే రాయక ఉన్నా అంతే! ఆయన ఎల్లారెడ్డి గూడలో సంచరించే శివుడు. నలుసంత నేనెంత నిఖిలాత్మ నీ చెంత అని పాడుకుంటూ ఉంటారు.. ఆయన.. ముఖ్యంగా ఆయన పాడే విధానం రాసే విధానం కన్నా బాగుంటుంది కొన్నిసార్లు.. గొప్ప గాత్రం అని కాదు గొప్ప అన్వయం ఆయనిది.. అందుకే ఆయన పాట పాడే విధానంలోనూ నిబద్ధాక్షరినే!
కాసిన్ని తాత్కాలిక ఉద్వేగాల నుంచి వేగాలు పుట్టుకువచ్చేయి.. కానీ కవికి వేగం ప్రామాణికం అవునో కాదో కానీ అలాంటి ప్రయాణంలో ఆయన వెనుకబడిపోయారు. కానీ గెలిచివచ్చిన వాదనలో మంచి పేరు తెచ్చుకుని కొన్నింట సరస్వతీ రూపాలను ప్రతిష్టించి వెళ్లారు..ఒక జ్ఞాన పీఠం అయి ఉన్న పాటలు కొన్ని ఆయనకు నచ్చాయి..పూర్వ కవి చెప్పిన భావనా స్రవంతికి ఆయన కొనసాగింపు అయ్యారు. అంత మంచి దారిని ఒకటి ఎందుకు వద్దనుకోవడం అని అనుకుంటూ ఆ దారెంట కొన్ని జ్ఞాపకాలను ఎంచుకుని తనకంటూ ఓ ప్రయాణం ప్రారంభించారు..తెలుగు వారికి గౌరవ రూపం వేటూరి.. మరో గౌరవ రూపం సిరివెన్నెల అని రాయొచ్చు తప్పులేదు.. మరో  గౌరవ రూపం ఉంటుందా?  కనుక రాసిన కొన్నింటిలో నిబద్ధాక్షరిని ధ్వనింప జేయడం ఆయన పొందిన గౌరవం. ఆ గౌరవానికి కొనసాగింపు ఇవ్వడం మనందరి బాధ్యత.. అశ్లీలం అన్నది చొరబడనీయక రాసిన కవి ఈయన అని  మరో వందేళ్లు చెప్పవచ్చు.. తప్పేం లేదు.

 
ఒప్పుకోదగ్గ ఓటములను వెలివేసి జీవించాలి.. ఓటములను గెలుపులనూ సమానంగా ఒప్పించడం కాలంతో జరగని పని..నేను కన్నీటి ప్రవాహాలను మోసుకుని వస్తే.. ఈ జీవిత సారం కొన్ని రాతలను విలువయినవి అని గుర్తించాలి అని ఉద్భోదిస్తుంది. కను క నాకు పుట్టుక కన్నా చావే ఇష్టం. తాత్కాలిక ఉద్వేగంలో ఉన్న చావును హాయిగా గుర్తించి రావాలి. ఉద్వేగాలను రద్దు చేశాక మంచి ఉద్దేశాల పుట్టుక ఒకటి మొదలవుతుంది. ఉచ్ఛ్వాస కవనం ఎందుకు అయింది.. అని తెలిసి వస్తుంది.. నిశ్వాస ఝరి విప రీతం అయిన ఇష్టంతో కూడిన విషయాలే బోధిస్తుంది.


ఇన్ని పుట్టుకలూ ఇన్ని చావులూ చూశాక కూడా పాట ఉంది అంటే అది ఎంత లోతుని లేదా ఎంతటి ఎత్తుని అందుకుని ఉం టుందో కదూ! నైరాశ్యం కమ్ముకున్న ఆకాశాలు ఇవి అని ఎవరు రాసినా నవ్వుకుంటాను. దేనినీ విఫలత నుంచి పొందకుండా ఉం డలేం. పాట కూడా విఫలత నుంచే వచ్చి ఉంటుంది. చావు నుంచి చచ్చే కోరిక నుంచి కూడా పాట వచ్చే ఉంటుంది. మన జీవితా ల్లో రాయాల్సినంత రాయకుండా ఉండడం కూడా విఫలతే అవుతుంది అని అనుకోను. రాయడం బాధ్యత అనే కన్నా నిబద్ధత అని రాయడం నాకెంతో ఇష్టమయిన నెపం. ఇష్టం అని చెప్పదగ్గ కారణం కూడా! మంచి పాట  రాయడంలో సిరివెన్నెల ఇష్టమ యిన పనులుగా చేసి పెద్దవారయ్యారు. ఇష్టం అంటే ఇతరుల అంగీకారం కోరుకోవడం కాదు తన మార్గం నుంచి తనకి తాను తప్పుకోవడం కూడా! కొత్త దారి అంతా నిష్కల్మష కీర్తిని పొంది ఉండాలి. అందుకు సిరివెన్నెల చేసిన ప్రయత్నాలు అన్నీ ఫలించి ఉండాలి. అందుకే పాట రాసిన ప్రతి చోటా ఆయన నిబద్ధాక్షరిగానే తోచారు. ఆఖరి నిబద్ధాక్షరి అని అంటున్నదే ఇందుకు !

 
- రత్నకిశోర్ శంభుమహంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: