రైతు చట్టాల రద్దు... విపక్షమే కీలకం...!

Podili Ravindranath
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన వెనుక ఏడాది కాలం రైతుల నిరసనలు, ఆందోళనలు ఉన్నాయనే మాట వాస్తవం. గతేడాది సరిగ్గా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే రైతు చట్టాల ప్రస్తావన తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. నాటి నుంచి వాటిని వ్యతిరేకిస్తున్న రైతులు... ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు భారత్ బంద్ చేశారు. పార్లమెంట్‌ బయట, ఎర్రకోట వద్ద కూడా తమ నిరసన తెలియజేశారు. ఇక కొంత మంది రైతులు అయితే... కొత్త చట్టాలను రద్దు చేసే వరకు కొత్త పంటలు కూడా సాగు చేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఆందోళనల్లో ఎక్కువ భాగం సిక్కులే ఉన్నారు. దాదాపు ఏడాది పాటు రైతులు ఆందోళన చేయడం... మరో మూడు నెలల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో... ఇక చేసేది లేక కేంద్రం దిగి వచ్చింది. గురునానక్ జయంతి సందర్భంగా సిక్కులకు కానుక ఇచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని మోదీ ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రద్దు చేస్తామని మోదీ అన్నారు. అయితే దీనిపై రైతుల నుంచి సానుకూల స్పందన మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
పార్లమెంట్ సమావేశాల్లో రద్దు చేసిన తర్వాతే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు రైతులు. అయితే రైతుల ఆందోళనలకు పూర్తిస్థాయి మద్దుతు తెలిపిన వారిలో ప్రతిపక్షాలు ముందు వరుసలో ఉన్నాయి. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం, ఆందోళనలు జరుగుతున్న శిబిరాల వద్దకు చేరి వారికి సంఘీభావం తెలియచేశారు కూడా. ఇక రైతులు పిలుపు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం కావడానికి విపక్షాలు ఎంతో సహకరించాయి. బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ చేసేందుకు అధికార పార్టీలే సహకరించాయి. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలకు రాహుల్, ప్రియాంక వంటి జాతీయ స్థాయి నేతలు నాయకత్వం వహించారు. లఖింపూర్ ఖేరి వంటి ఘటనల్లో రైతులకు పరిహారం అందించే విషయంలో కానీ, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకునే అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కీలకంగా వ్యవహరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రైతుల ఉద్యమాన్ని విపక్షాలు సారధ్యం వహించడం వల్లే.... భారతీయ జనతా పార్టీ నేతలు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. లేకపోతే... దీనికి మోదీ  సర్కార్ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదేమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: