ఊపందుకోనున్న అమరావతి ఉద్యమం

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా  అమరావతినే కొనసాగించాలని కోరుతూ సుధీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న ఉద్యమం మరింత ఉదృతం కానుందా ?  ఇప్పటి వరకూ వివిధ రూపాలలో తమ నిరసనను ప్రజలకు తెలియజెప్పిన  అమరావతి  రైతులు, జే ఏసి ప్రస్తుతం  తిరుమల వరకూ పాదయాత్ర సాగిస్తోంది.  ప్రకాశం జిల్లా  దాటి నెల్లూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది.  వారి పాదయాత్రకు వరుణుడు అడ్డోచ్చారు. దీంతో విరామం ఏర్పడింది. దేశ, రాష్ట్ర రాజకీయాలలో  రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అమరావతి ఉద్యమం మరింత ఉదృతమవుతుందని పలు రాజకీయ పక్షాలు, పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన రైతు చట్టాలను  ఆయన నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటన్నట్లు ప్రకటించింది. పోరాడితే పోయేది ఏమీ లేదు అన్న చందాన ఉత్తరాదిన రైతులు పోరుబాట సాగించారు.   గడ గడ వణికే చలిలో ఢిల్లీ నగర శివార్లలో బైఠాయించారు. వివిధ రూపాల్లో తమ నిరసనను యావత్ దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తెలియ బరిచారు.  రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ప్రభావం దక్షిణ భారత దేశంలో  తక్కువగానే కనిపించింది. అయితే రైతు చట్టాలను  కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం తో  జనం ఎక్కువగా జాగృత మయ్యారని చెప్పవచ్చు ఏ దైనా సమస్య వస్తే పోరాటం చేస్తే సాధించుకోవచ్చని  పలువురు భావిస్తున్నారు. గతంలో పోరాడితే  ప్రభుత్వం, పాలకులు ఇబ్బందులకు గురి చేస్తారనే భయం లోలోపల ఉండేది. కానీ  రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం,  వాటి పర్యవసానాలు దేశ ప్రజలు నిశితంగా గమనించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం మంచి ఫలితాలను ఇచ్చిందని,  పోరాట ఫలితంగానే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గారని ప్రస్తుతం అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
పోరాట స్పూర్తితో ముందుకు కదులుతున్న అమరావతి జేఏసి తమ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని తలంచినట్టు సమాచారం. ఇప్పటి వరకూ  అమరావతి పరిసరాల వరకే పరిమితంగా నూ, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మాత్రమే ఉద్యమం జరిగింది. ఎవరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వాస్తవంగా జరిగింది ఇదే.  ఇక నుంచి క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతంగా చేయాలని జేఏసి  భావిస్తోంది. వివిధ రాజకీయ పక్షాలు కూడా అమరావతి ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వాలని భావిస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా అమరావతి ఉద్యమంలో పాల్గోనాలని తమకు సూచించారని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కోన్నారు. బిజేపితో పాటు, జనసేన, కూడా అమరావతి రైతులు గొంతుకను బాహ్యప్రపంచానికి మరింతగా వెల్లడించనున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే తమ బహిరంగ మద్దతును ప్రకటించాయి. తిరుపతి- తిరుమల యాత్ర పూర్తయిన తరువాత  చేపట్ట వలసిన కార్యక్రమం పై జేఏసి నేతలు ఇప్పటి నుంచే కార్యచరణకు రూపకల్పన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: