ఆసుపత్రులలో కూడా.. ఐదుకే భోజనం..!

Chandrasekhar Reddy
తెలంగాణాలో ఉపఎన్నికల సందర్భంగా కొత్త పధకాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో పధకం తెచ్చారు కేసీఆర్. ఇకమీదట ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఆహారం కేవలం 5రూ. మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. తొలుత ఈ పధకం ప్రయోగాత్మకంగా జిహెచ్ఎంసి పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవేశపెడుతున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలో ఈ విధమైన ఏర్పాటు జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లను ఆయా శాఖలు యుద్ధ ప్రాతిపదికన సమకూరుస్తున్నాయి. నేడు ఈ పధకం ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం కొన్ని సాంకేతిక సమస్యల వలన రెండు రోజుల ఆలస్యంగా అందుబాటులోకి రానుంది.
ఈ పధకాన్ని ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, నిలోఫర్, ఉస్మానియా లలో ఏదో ఒక చోట స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. దీనికి కేసీఆర్ ఆహారామృతంగా లేక కేసీఆర్ బోజనామృతంగా లేక కేసీఆర్ అన్నామృతంగా పేర్లు పరిశీలిస్తున్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో దీనిని కొనసాగిస్తారు. అయితే విపక్షాలు మాత్రం కేసీఆర్ ఎన్నికల సమయంలోనే బయటకు వచ్చి ప్రజలను దారి మళ్లించేందుకు ఇలాంటి కొత్త పధకాలు వెలుగులోకి తీస్తున్నాడని విమర్శిస్తున్నారు. అది నిజమనే అనిపిస్తుంది ఎవరైనా కేసీఆర్ తీరును గమనిస్తే. ఒక్కసారైనా ప్రజలలోకి ఇతర సమయాలలో వెళ్లినట్టుగా ఆయన రాజకీయ చరిత్రలో లేదు. ఎప్పుడూ ఎన్నికల సమయంలో బయటకు రావడం, కొత్త పధకాల పేరుతో ఏదోఒకటి చేసి ఓటరును ఆకర్షించడం, ఓట్లు రాబట్టుకోవడం ఆయనకు సర్వసాధారణం అయిపోయింది.
ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ఉండటంతో దళిత బందు అనే కొత్త పధకాన్ని తెరపైకి తెచ్చాడు కేసీఆర్. దానిని భారీ మొత్తంగా తేవడంతో ప్రజలు కూడా గత హామీలు మరిచి ఈ పధకం తమకు ఎప్పుడు వర్తిస్తుందా, తమ ఖాతాలో నగదు ఎప్పుడు పడుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు. ఇలా కేసీఆర్ ఎన్నికల సమయంలో గిమ్మిక్కులు చేస్తూ పార్టీని ఒడ్డెక్కిస్తున్నారు. ఎవరైనా పాత పధకాల గురించి అడిగితే అంతే సంగతులు. ఇటీవల ఒక మీటింగ్ లో అలా అడిగిన మహిళను పోలీసులు పట్టుకెళ్లిన వైనం చూశాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: