ఉమ్మారెడ్డి అల్లుడుకు మళ్ళీ కష్టమేనా?

M N Amaleswara rao
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసిన నేత. కానీ నిదానంగా టి‌డి‌పిలో ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పి వైసీపీలోకి వచ్చేశారు. ఇక వైసీపీలో సరైన గౌరవం దక్కుతుంది. వెనుక ఉండి పార్టీకి సపోర్ట్‌గా నిలబడుతున్నారు. అలాగే ఈయనకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి తగిన గౌరవం ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో ఉమ్మారెడ్డి అల్లుడు కిలారు రోశయ్యకు పొన్నూరు టికెట్ ఇచ్చారు.
ఇక జగన్ గాలిలో రోశయ్య అప్పటివరకు ఓటమి ఎరగని ధూళిపాళ్ళ నరేంద్రని ఓడించారు. అసలు ధూళిపాళ్ళ కుటుంబానికి పొన్నూరులో తిరుగులేదు. 1983 నుంచి 2014 వరకు ఆ కుటుంబమే అక్కడ గెలుస్తూ వస్తుంది. వరుసగా అయిదుసార్లు ధూళిపాళ్ళ పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లోనే జగన్ వేవ్‌లో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ధూళిపాళ్ళని ఓడించి రోశయ్య మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.
అయితే ఎమ్మెల్యేగా రోశయ్య తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఈయనకు ప్లస్. అలాగే ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి కార్యక్రమాలు పొన్నూరులో జరుగుతున్నాయి. కానీ ప్రత్యర్ధిగా ఉన్న ధూళిపాళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే ఆయన చాలావరకు పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే రోశయ్య మీద మరీ ప్రజా వ్యతిరేకత ఏమి లేదు గానీ, ధూళిపాళ్ళ అనూహ్యంగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. పైగా సంగం డైరీ విషయంలో ఆయన్ని జైల్లో పెట్టారు.
దీని వల్ల నరేంద్రకే బాగా అడ్వాంటేజ్ పెరిగింది. ఆ సంగం డైరీ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తీరు కనబర్చిందో అందరికీ తెలిసిందే. జైల్లో పెట్టించడం వల్ల నరేంద్రకు సానుభూతి పెరిగింది. దీంతో పొన్నూరులో మరింతగా నరేంద్రకు మద్ధతు పెరిగినట్లు కనిపిస్తోంది. పైగా నియోజకవర్గంలో ఆయనకు తిరుగులేని బలం ఉంది. ఈ పరిణామాలని గమనిస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మారెడ్డి అల్లుడు రోశయ్యకు ధూళిపాళ్ళతో కష్టమే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: