బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎందుకు మారుతున్నారు?

Mekala Yellaiah
గత కొద్దికాలంగా బీజేపీ చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తోంది. ఐదునెలల్లో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించింది. అసోంలో శర్పానంద సోనోవాల్, ఉత్తరాఖండ్ లో తీరథ్ సింగ్ రావత్, త్రివేంద్ సింగ్ రావత్, కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. పార్టీలో బాధ్యతలు సమయానుకూలంగా మారుతుంటాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఉత్తరాఖండ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు మారిన తరువాత పుష్కర్ సింగ్ ధామీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప తరువాత బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసోంలో శర్పానంద సోనోవాల్ ను తప్పించి,  ఆయన స్థానంలో హిమంత బిశ్వ శర్మకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు గుజరాత్ సీఎం రాజీనామాతో ముఖ్యమంత్రుల మార్పు వెనుక బీజేపీ వ్యూహం బయటపడుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయాలే కీలకంగా ఉంటాయా.. లేక ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంటుందా అనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రుల మార్పు అంశంలో కచ్చితంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా దాగి ఉంటుందని చెబుతున్నారు. 

ఇదే విషయమై గుజరాత్ లో విజయ్ రూపానీని మీడియా ప్రశ్నించగా, ఆయన సమాధానాలను దాటవేశారు. సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రులను మార్చడం తప్పు కాదన్నారు. సాధారణ కార్యకర్త అయిన తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనకు ప్రత్యేక మార్గనిర్దేశనం చేసినట్టు చెప్పారు. గుజరాత్ మరింత అభివృద్ధి సాధించేందుకు కొత్త నాయకత్వం అవసరమని, అందుకే తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తుందని, వచ్చే ఎన్నికల్లో కూడా గుజరాత్ లో ఆ విధంగానే పోటీ చేస్తామని రూపానీ అన్నారు. ఇది బీజేపీ వైఖరిని తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: