టీఆర్ఎస్‌లో సంస్థాగత ఎన్నికలపై సందిగ్ధత!

N.Hari
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సంస్థాగత ఎన్నికల తేనెతుట్టేనే గులాబీ బాస్‌ కేసీఆర్‌ కదిపారు. అసలు జిల్లా కమిటీలనే వద్దనుకున్న ఆయన.. మళ్లీ వాటిపై మొగ్గు చూపారు. దీంతో ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో తనను మించిన వారు లేరని గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. ఒకపక్క హుజురాబాద్ ఉప ఎన్నిక, దళిత బంధుపై జోరుగా చర్చ జరుగుతుండగా..కేసీఆర్ మరో బాంబు పేల్చారు. పార్టీలో సంస్థాగత ఎన్నికల తేనెతుట్టెను కదిపారు. వాస్తవానికి హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేటెడ్ పదవులను అక్కడి వారికే సీఎం ఇవ్వడం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ  నేపథ్యంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రకటన చేశారన్న చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచీ జిల్లాల కమిటీలను నియమిస్తామనడంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
చాన్నాళ్ల తర్వాత టిఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ తీరు మారింది. దూకుడుగా వ్యవహరిస్తోంది. బీజేపీ-కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో వారి విమర్శలను తిప్పికొట్టడానికి  పార్టీకి యంత్రాంగం అవసరమైంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల పదవుల్లో ఉన్న టిఆర్ఎస్  ప్రజాప్రతినిధులు సైతం నోరు విప్పడం లేదు. దీంతో పార్టీ నిర్మాణం చేయకపోతే విపక్షాల విమర్శల దాడిలో... చతికిల పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు చర్చ సాగుతోంది.
అయితే తాజా పరిస్థితిని బట్టి చూస్తే మళ్లీ మంత్రులు,ఎమ్మెల్యేలు సూచించిన వారికే మళ్లీ పదవులు దక్కుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే జరిగితే పదవులు దక్కని నేతలంతా ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశాలున్నాయి..! ఈ క్రమంలో  షెడ్యూల్ ప్రకారమే టిఆర్‌ఎస్‌లో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయా...! అన్నది సందేహంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: