హాట్ టాపిక్ గా చిత్తూరు జిల్లా

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు జిల్లాకో ప్రత్యేక స్థానం ఉంది. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకు చెందిన నేతలే. అలాగే ఎంతో మంది ఈ జిల్లాకు చెందిన నేతలు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు కూడా. ఏడుకొండల వాడు కొలువైన ఈ జిల్లా ఇప్పుడు మరోసారి హాట టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మంత్రివర్గ విస్తరణ సమయంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏర్పాటవుతున్న మంత్రివర్గం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుందని... ఆ తర్వాత రెండున్నరేళ్లు కొత్త వారికి అవకాశం దక్కుతుందని వెల్లడించారు. కొంతమంది సీనియర్లకు తొలి విడతలో అవకాశం దక్కనప్పటికీ... రెండో విడతలో తప్పనిసరిగా ఛాన్స్ వస్తుందని గంపెడంత ఆశతో ఉన్నారు.
ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తొలి విడతలో జిల్లాకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఇక జిల్లాకు చెందిన నారాయణ స్వామికి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అయితే దాదాపు పార్టీ ప్రారంభం నుంచి జగన్ వెంటే ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మాత్రం అవకాశం దక్కలేదు. ఇందుకు పెద్దిరెడ్డికి రోజాకు మధ్య ఉన్న విబేధాలే కారణమని అప్పట్లో అంతా భావించారు. అసలు రోజాకు పదవి రాకుండా చేసిందే పెద్దిరెడ్డి అని కూడా పుకార్లు షికారు చేశాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ఆయకు కుమారుడు మిధున్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అదే సమయంలో ఆర్కే రోజాపై పార్టీలోని కొంతమంది నేతలే అధినేతకు చెప్పారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న రోజాను బుజ్జగించేందుకు సీఎం జగన్ ఏపీఐఐసీ ఛైర్మన్ల పదవి కట్టబెట్టారు. దాదాపు రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న రోజాను ఇటీవలే తొలగించారు కూడా. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రోజాకు కేబినెట్ పోస్ట్ ఓకే అయిందని... అందుకే ఏపీఐఐసీ పదవి నుంచి తొలగించారని అంతా భావించారు. అయితే రెండో విడతలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను తొలగిస్తారా... లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. అబ్కారి శాఖ నిర్వహిస్తున్న నారాయణస్వామిని తప్పిస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మరి పెద్దిరెడ్డి పరిస్థితిపై మాత్రం ఇంకా ఏ విషయం బయటకు రావడం లేదు. పార్టీలో సీనియర్ గా, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా ఉన్న పెద్దిరెడ్డిని కొనసాగిస్తారని ఆయన అభిమానులు అంటుంటే... లేదని వైరి వర్గం ప్రచారం చేస్తోంది.  నారాయణ స్వామి ఎస్సీ కావడంతో... ఆయన స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు అవకాశం కష్టమే అని అంతా అంటున్నారు. రోజాకు పదవి రావాలంటే.. పెద్దిరెడ్డిని తప్పించాల్సిందే అనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డిపై రోజా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎవరికి పదవి దక్కుతుందో.. ఎవరి పదవి ఊడుతుందో అనేది హాట్ హాట్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: