జగన్ పాలన పై ప్రజల్లో ఆందోళన.. జ‌న‌సేన‌ లేఖలో సంచలనం.. !

జగన్ పాలన పై ప్రజల్లో ఆందోళన పెరిగిందంటూ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున‌ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో వైసీపీ ప్ర‌భుత్వం పై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి గారి నాయకత్వం పై ప్రజల్లో ఆందోళన పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం తప్ప సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలి అనే జ్ఞానం కరువైందని ఆరోపించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు పై బెంగతో ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆరోపించారు. యువతకు అండగా జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు ఇబ్బంది పెట్టాలని చూసిన విషయాన్ని గుర్తు చేశారు. 

రాష్ట్రాన్ని ఆర్థిక లోటు వేధిస్తోందని పేర్కొన్నారు. వేల కోట్లు ఎటు వెళ్లి పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఎలా ఉంది అనే విషయం దేశమంతటా తెలిసింది అని పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించిన కార్యకర్తలకు బీమా పత్రాలు, ఐడి కార్డులను నాదెండ్ల మ‌నోహ‌ర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.... జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం నమోదు అని తెలిపారు.

అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన కార్యకర్తలను అభినందించడం మన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న స‌మ‌యంలోనూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో పని చేసిన కార్యకర్తలకు ప్రమాదం జరిగినప్పుడు దేశ, విదేశాల్లో ఉన్న పార్టీ సానుభూతిపరులు స్పందించి బాధితులకు అండగా ఉండి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. అటువంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తుల వ‌ల్లే పార్టీలో సభ్యత్వం కార్యక్రమాన్ని రూపొందించామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: