సంజయ్‌లాగా సోము రీప్లేస్ చేయలేకపోతున్నారే..!

M N Amaleswara rao

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో బీజేపీ నేతలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో ఏపీలో ఒక్కశాతం ఓట్లు రాకపోయిన సరే, తామే జగన్‌కు అసలైన ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మొదట్లో వరుసపెట్టి టీడీపీ నేతలకు కాషాయ కండువా కప్పుతూ,  ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ స్థానంలోకి బీజేపీ వస్తుందని ప్రకటించేశారు.


అయితే ఈ రెండేళ్లలో టీడీపీ స్థానం అలాగే ఉంది. అలాగే బీజేపీ స్థానం కూడా ఇంకా నోటా ఓట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ పార్టీకి ఏ మాత్రం ఓటు బ్యాంక్ పెరగలేదు. గత ఎన్నికల్లో నోటా దాటి ఓట్లు తెచ్చుకోలేని బీజేపీ, ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే పెద్దగా ప్రయోజనం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన ఓట్లే కాస్త తగ్గాయని చెప్పొచ్చు.


అసలు ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఏ మాత్రం సత్తా చాటలేకపోతున్నారని తెలుస్తోంది. పైగా ఏపీ బీజేపీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొందరు జగన్‌కు మద్ధతుగా ఉంటే, మరికొందరు  చంద్రబాబుకు మద్ధతుగా ఉన్నారు. సోము సైతం జగన్‌కు మద్ధతుగా ఉన్నారనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీని వల్ల ప్రజలు సైతం బీజేపీ వైపుకు రావడం లేదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రానికి పెద్దగా న్యాయం చేయట్లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. హోదా, ఇతర విభజన హామీలని బీజేపీ అమలు చేయడం లేదు. అందుకే ఇంకా ఏపీ ప్రజలు బీజేపీని నమ్మట్లేదు.


అయితే తెలంగాణలో బీజేపీ పరిస్తితి చాలా మెరుగ్గా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్‌గా రాజకీయం చేస్తూ, బీజేపీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని రీప్లేస్ చేయగలిగారు. ఇప్పుడు కేసీఆర్‌కు బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధిగా నిలబెట్టడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని రీప్లేస్ చేయడంలో సోము ఫెయిల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: