సంప్రదాయ మత్స్యకారులు ఏకతాటిపై ఉండాలి..!

Edari Rama Krishna
ఏపీలోని 14 ఉప కులాలకు చెందిన  సంప్రదాయ మత్స్యకారులంతా  ఏకమై, ఒకే  తాటిపై ( ఒకే గొడుగు కింద) పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ  మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య అనే పేరును నూతనంగా  అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసి ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీమంత్రి నడకుదిటి నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను అధికారికంగా ప్రకటించారు.

అలాగే 14 ఉప కులాలకు సంబంధించిన సంప్రదాయ మత్స్యకార కులాల జెండా, లోగోలను మంత్రి కొల్లు రవీంద్ర, నడకుదిటి, మోపిదేవి, ఆఫ్కాబ్ చైర్మన్ కొండూరి పాలిశెట్టిలు  ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశానికి 13 జిల్లాలకు చెందిన కన్వీనర్లు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా కులం కోసం అందరూ కలసి పనిచేయాలని అన్నారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు నడకుదిటి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోపిదేవిలు మాట్లాడారు. 14 ఉప కులాలు మొట్టమొదటి సారిగా కలవడం  అభినందించిన విషయమన్నారు. ఏపీకి సంబంధించిన నూతన కమిటీతో పాటు 13 జిల్లాలకు సంబంధించిన జిల్లా కన్వీనర్ లతో పాటు.. రెండు.. రెండు జిల్లాలకు కన్వీనర్లను కూడా నియమించి ప్రకటించారు. వీటితోపాటు అనుబంధ సంఘాలు ఏపీ మహిళా విభాగం, న్యాయ, యువజన, విద్యార్థి, కార్మిక, రైతు, ఉద్యోగుల, మేధావుల విభాగాలను ఏర్పాటు చేశారు.

ఈ అనుబంధ విభాగాలకు ప్రతి జిల్లాలో కమిటీలు కూడా ఉంటాయని రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు మీడియా సమావేశంలో వివరించారు. తామిద్దరం.. ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాలలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ తయారు చేసుకొని.. ముందుకు సాగుతామన్నారు. 13 జిల్లాలలో సంప్రదాయ మత్స్యకారులు  ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. ఈనెల నుంచే జిల్లాల పర్యటన కు వెళతామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: