అన్నంత పని చేసిన ట్రంప్.. మళ్లీ దూసుకొచ్చేశాడు..?
అయితే.. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు తమపై వివక్ష ప్రదర్శించాయని ట్రంప్ అప్పట్లో చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తానే సొంతంగా సోషల్ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని అప్పట్లో ప్రకటించాడు.. ఇప్పుడు అన్నంత పనీ చేసిన ట్రంప్.. సొంత సోషల్ మీడియాతో మళ్లీ రాబోతున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేశారు.
ఆ తర్వాత ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేశారని ట్రంప్ ఎకౌంట్లను ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ నిషేధించాయి. దీంతో ట్రంప్ మండిపడ్డారు. తానే వీటికి ధీటుగా కొత్త యాప్‌ను తీసుకొస్తానన్నారు. ఇప్పుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్‌ను ట్రూత్ సోషల్ పేరుతో తీసుకొచ్చారు. ఇది ఇవాళ్టి నుంచి యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్ రూపొందించిన ఈ కొత్త సోషల్ మీడియా యాప్ సోషల్ ట్రూత్ అచ్చం ట్విట్టర్‌లానే ఉంటుంది.
ది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ నేతృత్వంలో ఈ ఈ ట్రూత్ సోషల్ యాప్ తయారైంది. ట్రూత్ యాప్‌లోనూ ట్విట్టర్ తరహాలోనే ఒకరినొకరు ఫాలో చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడూ ట్రెండింగ్‌లో ఉన్న అంశాలను తెలుసుకోవచ్చు. బీ రెడీ మీ అభిమాన అధ్యక్షుడు మిమ్మల్ని కలవబోతున్నాడంటూ కొత్త యాప్ నుంచి ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మొదటి ట్రూత్ చేశారు. ఇప్పుడు ఈ ట్రూత్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ ట్రూత్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.