శ్రావణ మాస ప్రాముఖ్యత !

Seetha Sailaja
శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మంగళవారం శుక్రవారం పౌర్ణమిలు చాల విశిష్టమైన రోజులుగా భావించే సాంప్రదాయం తరతరాల నుంచి వస్తోంది.

శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు చేసే శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పారు. ఆరోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున శివుడిని భక్తితో అభిషేకించిన వారికి శివా అనుగ్రహంతో పాటు విష్ణువు అనుగ్రహం కూడ లభిస్తుందని అని అంటారు. అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము చేసుకోవడం తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం.  తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోమును  నోచుకుంటారు.

శుక్రవారాన్ని లక్ష్మీదేవి కి ఇష్టమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానం ఉందని పండితులు చెపుతుంటారు.  ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున ‘మహాలక్ష్మి’ ని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయని చెబుతారు. ఈ శ్రావణ మాసం అంతా  అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే సిరిసంపదలు కలుగుతాయి అని నమ్మకం.

ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ 'వరలక్ష్మీ వ్రతం' జరుపుకుంటారు. ఈరోజున ప్రతి గృహం పేరంటాళ్ళతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వ్రతం జరుగుతున్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని అభిప్రాయ పడతారు. ఇక శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది అని మన శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ శ్రావణ పౌర్ణమి రోజున 'రక్షాబంధన్' పండుగ జరుపుకుంటారు. తరాలు మారిపోతున్నా జీవితం అంతా యాంత్రికమై పోతున్నా ఇప్పటికీ శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు చాలామంది ఇళ్ళల్లో కొత్త పెళ్ళి కూతుళ్ళతో నోములు పట్టిస్తూ ముతైదువులతో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన మాసం శ్రావణ మాసం..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: