బుల్లితెర షో నుంచి చిరు తప్పుకుంటున్నారా..!

Edari Rama Krishna
తెలుగు వెండి తెరపై మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు.  దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి సినిమాల్లో నటించారు.  మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు.  అప్పటి వరకు చిరంజీవి క్రేజ్ పై అనుమానాలు పడ్డ జనాలు ఈ చిత్రం తర్వాత ఆయనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని కితాబు ఇచ్చారు.  అంతే కాదు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరు కి బ్రహ్మరథం పట్టారు.  

అయితే వెండి తెరపై ఎంత గొప్ప పేరు సంపాదించారో..బుల్లి తెరపై మాత్రం అంత పేరు తెచ్చకోలేక పోయారు మెగాస్టార్. బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు రెండు సీజన్స్ కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. మూడో సీజన్ లో కాస్త టీఆర్పీ తగ్గడంతో నాగార్జున స్థానంలో చిరంజీవితో నాలుగో సీజన్ మొదలుపెట్టారు. వెండితెరపై మెగాస్టార్ గా రాణించిన చిరు బుల్లితెరపై కనిపిస్తుండడంతో నాలుగో సీజన్ కు అదిరిపోయే టీఆర్పీ వస్తుందని నిర్వాహకులు భావించారు.

కానీ చిరు హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం పెద్దగా ఆకర్శించలేక పోతుంది. దీంతో టీఆర్పీ రేటింగ్ మరీ దారుణంగా పడిపోయింది.  ఒకదశలో మధ్యలోనే షో ఆపేద్దామని కూడా నిర్వహకులు అనుకున్నారట కానీ అప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, బ్రాండింగ్, చిరంజీవికి ఇచ్చిన భారీ పారితోషికం వల్ల ఇప్పటివరకు నెట్టుకుంటూ రావాల్సి వచ్చిందట.

ఇప్పుడు సీజన్ 4 ముగిసింది. మరి నెక్స్ట్ సీజన్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.  మరోవైపు చిరు ఆగస్టు నుండి '' ఉయ్యాలవాడ నరసింహారెడ్డి '' చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు . గొప్ప పోరాట యోధుడి చిత్రం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పైగా మూడు భాషలలో ఆ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం నుండి చిరు తప్పుకోవడం ఖాయం అని వినిపిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: