నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..

Vennelakanti Sreedhar
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
అంటూ గాయం చేసిన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.  ఈయన గత మూడు దశాబ్దాలకు పైగా తెలగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.తెలుగులో సాహిత్యం... ముఖ్యంగా సినీ రంగంలో  సాహిత్యం రోజు రోజుకూ మసక బారుతోందని కొందరు సాహితీ వేత్తలు  పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న రోజుల్లో సినీ రంగాయనికి పరిచయమైన రచయిత సీతారామ శాస్త్రి. ఏ విధాత తలఁపున.. 1986లో సినీ రంగంలోకి వచ్చారో కానీ... నాటి నుంచి నేటి వరకూ అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు.  సినీరంగ పూదోటలో  సిరివెన్నెలలు పూయిస్తున్నారు. సినీ రంగంలో దిగ్గజ కవులు సి. నారాయణ రెడ్డి,ఆత్రేయ, వేటూరి తదితర కవులు ఎందరో తన తేనెపలుకులను ఈ ప్రపంచానికి అందించారు. అయినా  సినీరంగ సాహిత్యం పై విమర్శలు వస్తూనే ఉన్నాయి.  సీతారామ శాస్త్రి సినీ రంగానికి పరిచయం  అయ్యాక విమర్శకుల నోళ్లు మూతపడ్డాయని చెప్పవచ్చు.
నమ్మకు నమ్మకు ఈ రేయిని... కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను..... అంటూ రుద్ర వీణ వినిపించినా...
తెల్లారింది లెగండోయ్‌ కొక్కురోక్కో
మంచాలింక దిగండోయ్‌ కొక్కురోక్కో
పాములాంటి సీకటి పడగ దించి పోయింది
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి..... అంటూ తన గానామృతంతో  సినీ ప్రేక్షకులను మేల్కోలిపిన వ్యక్తి  సిరివెన్నెల. పదాలు పలికి, గానంగా నిలిచిందా అన్నట్లుగా సీతారామ శాస్త్రి స్వయంగా  తాను రాసి పాటను తానే పాడారు. ఈ  పాట  1988లో వచ్చిన కళ్లు చిత్రంలోనిది. దీనికి సంగీత దర్శకత్వం వహించిన వ్యక్తి  అందరికీ చిరపరిచితులైన నేపథ్య గాయకుడు  శ్రీపతి పండితారాధ్యు బాల సుబ్రమణ్యం. తాను పాటలను, తానే పాడిన వ్యక్తులను వాగ్గేయకారులంటారు.ఇదే విషయాన్ని ఓ పాత్రికేయ మిత్రుడు  సీతారామ శాస్త్రి వద్ద ప్రస్తావించారు. అందుకాయన సున్నితంగా... వాగ్గేయకారులెక్కడ ? నేనెక్కడ? అంటూ సమాధానం ఇచ్చారు.
పెద్ద పెద్ద అర్థాలను చిన్న చిన్న మాటలలో  మల్లెల మాల లాగా చెప్పడం ఆయన సొంతం. అదే సమయంలో తెలుగు భాష గొప్పతనాన్ని కూడా అందులోనె సుతిమెత్తగా చొప్పిస్తారు.  సినిమా కథకు అణుగుణంగా ఆయన పాటలుంటాయి. అయితే .. అదే పాటల్లో ఆయన చెప్పదల్చుకున్న అంశాలను ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రూపంలో చెపుతారు. జనంలో చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. తెలుగు భాష మీద, నుడికారం మీద మమకారాన్ని పెంచుతారు.
సీతారామ శాస్త్రికి మనం ఏమి ఇవ్వగలం?
...నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అన్నట్లుగా ఆయన బాటలో నడవడం మించి మనం ఏం ఇంకేం చెయ్యగలం


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: