సినిమా వాళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఎంతో కష్టపడి సినిమా తీసి ఆ తర్వాత ప్రమోషన్స్ చేసుకోవాలి. ఇక ప్రమోషన్స్ లో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు అన్నింటికి చాలా ఓపికగా సమాధానం ఇవ్వాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలు సినిమా వాళ్ళను ఇబ్బంది పెడతాయి కూడా. తాజాగా అలాంటి అనుభవమే టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరంకు ఎదురైంది. కిరణ్ అబ్బవరం తాజాగా దిల్ రూబా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు... మీరు క సినిమా విడుదల చేసిన ఆరు నెలలకే దిల్ రూబా విడుదల చేస్తున్నారు అని ప్రశ్నించారు.
దీనికి కిరణ్ మాట్లాడుతూ.. తాను యంగ్ హీరోను అని ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయాలని అన్నారు. అలాంటప్పుడు మీరు 2024 లో కేవలం ఒక సినిమానే ఎందుకు చేశావని అడగాలని హితవుపలికారు. అనంతరం మీకు క సినిమా విషయంలో చెక్ పోస్ట్ ఆఫీస్ తో ఇబ్బంది వచ్చింది కదా.. ఈ సినిమాకు కూడా అలా జరుగుతుందేమో అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీంతో కిరణ్.. ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకం అని చెప్పారు.
అయినా ఆ ఇష్యూ అయిపోయిందని దాని గురించి మాట్లాడనని సమాధానం దాటవేశారు. మరో రిపోర్టర్ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించగా... ప్రస్తుతం ఆమె మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉందని ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే దిల్ రుబా సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించగా శివం సెల్యులాయిడ్, ప్రొడక్షన్ ఏ యూత్ సంయుక్తంగా నిర్మించాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేపథ్య సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.