గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం జనవరి 02న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గ్లోబల్ స్టార్ నటన అద్దిరిపోయిందని, డైలాగులు కూడా బాగా పేలాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అలాగే అప్పన్న అనే రాజకీయ నాయకుడిగానూ అలరించనున్నాడు.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఈ ట్రైలర్ నిదర్శనం. కాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సినిమా నిడివి 165.30 నిమిషాల 2:45 గంటలు ఉండనున్నట్లు తెలిపింది.ఇదిలావుండగా సంగీత దర్శకుడు తమన్ ఎక్స్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేశారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘గేమ్ ఛేంజర్’ అన్ని అంశాల్లోనూ భారీ చిత్రం. పాటలన్నింటినీ 2021 డిసెంబర్ లోపే పూర్తి చేశా. శంకర్ సర్ సినిమాకి అంత వేగంగా కంపోజింగ్ అయిపోతుందని నేను హించలేదు. అవి బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. వాటి చిత్రీకరణ విషయంలో శంకర్, నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీపడలేదు.
‘జరగండి జరగండి’ పాట అద్భుతం. కళ్లజోడు లేకుండానే 3డీ చూసినట్టు ఉంటుంది. ఇందులో ఆరు పాటలున్నాయి. జనవరి 4న రెండు సాంగ్స్ విడుదల చేయనున్నాం. రిలీజ్‌కు మరో బిట్ సాంగ్ కూడా ఉంది. ఆయనతో కలిసి పని చేయాలనే నా డ్రీమ్ ఈ చిత్రంతో నెరవేరింది. ఈ సినిమాతో శంకర్ ఎడిటింగ్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. మూవీ సెకండాఫ్ రేసీగా ఉంటుంది. రామ్ చరణ్ స్ర్కీన్ ప్రెజెన్స్ అదుర్స్. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్, అంజలి పాత్రకు ప్రశంసలు దక్కుతాయి. అంజలికి జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా. ‘ఇండియన్ 2’ ఫలితంపై కాస్త నిరాశ చెందిన డైరెక్టర్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో హిట్ కొట్టేస్తారు’’ అని అన్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్‌రాజు నిర్మించిన 50వ సినిమా ఇది.ఇదిలావుండగా ఇది పాన్ ఇండియా మూవీ అని చెబుతున్నారు కానీ ఇంత వరకు ఆ స్థాయి ప్రమోషన్స్ అయితే కనిపించడం లేదు. అసలు హిందీలో ఈ మూవీని మినిమం ఓపెనింగ్స్ అయినా రాబడుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు, తమిళంలోనే గేమ్ చేంజర్ సందడి కనిపించేలా ఉంది.