కల్కి 2898 AD: తెలుగు డబ్బింగ్ పై విమర్శలు.. నాగీ కావాలనే చేశాడా?

Purushottham Vinay
 అమితాబ్ బచ్చన్ నుండి శాశ్వత ఛటర్జీ వరకూ.. అందరూ తెలుగు నేర్చుకుని కల్కి 2898 AD లో తమ పాత్రలకు ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారు. అతిథి పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి యాక్టర్స్ కూడా తెలుగులో సొంతంగా మాట్లాడారు.బాలీవుడ్ టాప్ స్టార్ అమితాబ్ ఈ చిత్రంలో కీలకమైన అశ్వత్థామ పాత్రలో నటించారు. 'మనం' 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన నటించిన మూడో మూవీ ఇది. ఈ పాత్రలో తన పాత్ర కోసం తెలుగు డైలాగులు పలకడం నేర్చుకొని, సొంతంగా డబ్బింగ్ చెప్పినందుకు ఆయన్ను నిజంగా మెచ్చుకోవాలి. తెలుగులో బిగ్ బీ బేస్ వాయిస్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయి మూవీలో గూస్ బంప్స్ తెప్పించింది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కు కూడా ఇది తొలి తెలుగు చిత్రం. ఈ మూవీలో గర్భవతి అయిన ల్యాబ్ సబ్జెక్ట్ SUM-80 పాత్రలో నటించింది. దీని కోసం ఆమె తెలుగు పలకడం నేర్చుకొని మరి కొన్ని డైలాగులు చెప్పింది. కమల్ హాసన్ కు తెలుగులో నటించడం కొత్త కాదు. కొంతకాలం నుంచి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' కోసం మరోసారి తన గొంతు సవరించుకున్నారు. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా డైలాగులు చెప్పారు. 


తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకున్న కమల్ కు అది అంత కష్టమేమీ కాదు కానీ, పెద్ద పెద్ద డైలాగులను అన్ని భాషల్లో కూడా పలకడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన కాంప్లెక్స్ ను శాసించే సుప్రీమ్ యాస్కిన్ గా నటించి ఆకట్టుకున్నారు.అలాగే సీనియర్ నటి శోభన చాలా ఏళ్ళ తర్వాత కల్కితో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమె శంభాల నాయకురాలు మరియమ్మ పాత్ర పోషించింది. కేరళకు చెందిన శోభన గతంలో చాలా తెలుగు చిత్రాల్లో నటించింది కానీ, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇప్పుడు తన సొంత గొంతు వినిపించింది. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, తమిళ నటుడు పశుపతి, మలయాళ నటి అన్నా బెన్.. ఇలా ప్రధాన పాత్రధారులందరూ కూడా ఓన్ గా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. 


తెలుగు మాట్లాడటం రాని యాక్టర్స్ తో, సొంతంగా డైలాగులు చెప్పించడం నిజంగా మామూలు విషయం కాదు. ఈ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అయితే కొంతమంది స్పాయిలర్స్ నుంచి ఇదేం తెలుగు అంటూ విమర్శలు వస్తున్నాయి.తెలుగులో సరిగా మాట్లాడలేకపోయారని, వినడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. క్యారక్టర్ ఆర్టిస్టులంతా కూడా ఎన్నారైల్లాగా మాట్లాడుతున్నారని ఫ్యూచర్ లో తెలుగుకి తెగులు పట్టిస్తారని ఈ సినిమాతో చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే 'కల్కి' కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగే కథ కాబట్టి, భవిష్యత్ లో ప్రజలంతా తెలుగులో ఇలానే మాట్లాడతారని దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్ళకి కట్టినట్లు చూపించాడు. ఇది తెలిసి నాగీ విజన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: