ఎక్కడా కనిపించని పవన్ ఫొటో.. టీడీపీ-జనసేన మధ్య మైత్రి చెడిందా?

Suma Kallamadi
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించాయి. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి ఏకంగా 164 స్థానాల్లో గెలిచింది. ఇక ఎంపీ సీట్లను 21 గెలుచుకుంది. ఎన్నికల ముందు వరకు టీడీపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. పైగా చంద్రబాబు జైలుకు వెళ్లడం, ఆ పార్టీ నేతల్లో అభద్రతా భావాన్ని పెంచింది. ఆ సమయంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ జైలులో కలిసి మద్దతు ప్రకటించడం, అక్కడే పొత్తు నిర్ణయం జరగడం వంటివి చకచకా జరిగిపోయాయి. పవన్ మరో వైపు బీజేపీ పెద్దలను సైతం ఒప్పించి ఆ పార్టీ కూటమిలో ఉండేలా చేశారు. వీటన్నింటి మధ్య ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో ఎవరూ ఊహించని విధంగా కూటమికి ప్రజలు భారీగా ఓట్లేశారు. వైసీపీ ఖంగుతినేలా ఫలితాలను ఇచ్చారు. వైసీపీ 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇక ఎన్నికల్లో గెలిచాక పవన్ మద్దతు వల్లే ఇంత భారీ మెజార్టీ వచ్చిందని చంద్రబాబు గ్రహించారు. జనసేన అధినేత పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో పాటు కీలక శాఖలను ఆయనకు అప్పజెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎంగా తన ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫొటో కూడా ఉండాలని ఆదేశించారు. అయితే ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా సోమవారం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. అయితే అంతకు ముందు పేపర్లలో ప్రకటనలను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్, ప్రధాని మోడీ ఫొటోలు ఉంటాయని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా కేవలం చంద్రబాబు ఫొటో మాత్రమే ఆ ప్రకటనలలో ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు సంస్మరణ సభలో సైతం ఇదే తరహా వాతావరణం కనిపించింది. దీంతో కావాలనే జనసేనను టీడీపీ అవమానిస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదంతా పవన్‌కు తెలిసి జరుగుతుందా? లేక తెలియకుండా జరుగుతుందా అనే చర్చ సాగుతోంది. సాధారణంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోనే పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఆ శాఖ మంత్రి పవన్ ఫొటో లేకుండా ప్రస్తుతం కార్యక్రమం జరగడంతో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పవన్, చంద్రబాబు అధికారికంగా ఇంకా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: