"అల్లు అర్జున్" సినిమాలకు తిప్పలు తెచ్చి పెట్టిన 'నంద్యాల' పర్యటన..!!

murali krishna
అల్లు అర్జున్ ఏ ముహూర్తాన తన స్నేహితుడు వైస్సార్సీపీ అభ్యర్థి శిల్ప రవికిశోర్ చంద్ర రెడ్డికి తన మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్ళాడో కానీ పాపం అప్పటి నుండి అతనిపై ట్రోలింగ్ ఎక్కువైపోయింది.మెగా కుటుంబం నుండి అతనికి వెళ్లొద్దు అని ఒక సందేశం వచ్చినా వినకుండా నంద్యాల వెళ్ళాడు అని ఒక వార్త వినపడింది. పోనీలో ఏదో స్నేహితుడు కోసం వెళ్ళాడు అనుకుంటే, అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడటమే కాకుండా, తన స్నేహితుడు పిలవలేదని, తానే వచ్చాను అని చెప్పాడు. అది కొంచెం మెగా అభిమానులకి నచ్చకపోగా, ఎందుకు ఇలా చేశాడు బన్నీ అని అనుకున్నారు.అదైపోయింది, హైదరాబాదులో ఓటింగ్ జరిగిన రోజు పోనీ సైలెంట్ గా వూరుకున్నాడా, లేదు మళ్ళీ నంద్యాల వెళ్లిన ఘటనపై వివరణ ఇచ్చాడు. ఇలా ఇవ్వటం అగ్గిపై మరికొంచెం ఆజ్యం పోసినట్టయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలిచింది, వైస్సార్సీపీ అడ్రసులు గల్లంతయ్యాయి. బన్నీ వెళ్లిన నంద్యాలలో కూడా బన్నీ స్నేహితుడు ఓడిపోయాడు. టైము బాగోలేదు అంటారు కదా, మరి బన్నీకి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి అని ఒక చర్చ.

ఎందుకంటే ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప 2' డిసెంబర్ 6కి వాయిదా పడింది. 2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' తరువాత ఆ సినిమా సీక్వెల్ విడుదల చెయ్యడానికి మూడు సంవత్సరాలా అని అభిమానులు అంటున్నారు. 'పుష్ప 2' వాయిదా పడింది సరే, మరీ బన్నీ తరువాత సినిమా అట్లీ తో కదా చెయ్యాలి, ఆ సినిమాకి మొదలవ్వకుండానే హైప్ వచ్చింది కదా. మరి ఆ సినిమా కూడా లేదు అంటున్నారు. ఎందుకంటే అట్లీ చాలా రోజులు ఎదురుచూసే రకం కాదు, అందుకని అతను సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
పోనీ బన్నీ వేరే ఏ సినిమా అయినా మొదలు పెడదామా అంటే, 'పుష్ప 2' విడుదలైతే కానీ కాదు. ఎందుకంటే పుష్ప రాజ్ లుక్ అలాగే ఉండాలి కదా. ఫిజిక్ కూడా అలానే మైంటైన్ చెయ్యాలి మరి. 'పుష్ప 2' సీక్వెల్ కే మూడేళ్లు పడితే, మరి 'పుష్ప 3' సంగతి ఏంటి? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అందుకే 'పుష్ప 3' ఇప్పుడు లేనట్టే అని చెపుతున్నారు యూనిట్ సభ్యులు. 'పుష్ప 2' తరువాత అల్లు అర్జున్ సినిమా ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోయింది అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. సినిమా విషయంలో ఇలా అన్నీ వెనక్కి వెళుతుంటే, ఇంకో పక్క ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. పోనీ అవన్నీ వదిలేస్తే, మెగా కుటుంబం బన్నీని పక్కన పెట్టింది అనేది ఇంకో వార్త నడుస్తోంది.మరి ఏ ముహూర్తాన నంద్యాల వెళ్ళాడో కానీ, బన్నీకి పాపం ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని అతని చుట్టుపక్కల వుండేవాళ్ళు అంటున్న మాటలు. ఎప్పుడైనా సక్సెస్ వచ్చినప్పుడే మనిషి చాలా జాగ్రత్తగా, ఒద్దికగా, సౌమ్యంగా ఉండాలి, అంతేగానీ ఎగిరెగిరి పడకూడదు అంటారు. జాతీయ ఉత్తమనటుడుకి ఒక్కసారిగా విజయాలు ఆవహించేసరికి అవతలి వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినపడలేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: