తేజ సజ్జ మిరాయ్ !

Seetha Sailaja
సాధారణంగా బాల నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న అబ్బాయిలు ఆతరువాత కాలంలో హీరోలుగా రాణించిన సందర్భాలు చాల అరుదు. గతంలో తరుణ్ ఆనాటితరం అమ్మాయిల డ్రీమ్ హీరోగా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో రాణించాడు. అయితే తరుణ్ ఫెడవుట్ అయిన తరువాత మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా రాణించలేదు.

అయితే ఎవరు ఊహించని విధంగా తేజ సజ్జా ‘హనుమాన్’ మూవీతో క్రేజీ హీరోగా మారిపోవడంతో అతడి డేట్ ల గురించి అనేకమంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ మహేష్ లతో బాలనటుడుగా నటించి రాణించిన తేజ సజ్జా ‘ఓ బేబీ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేయడంతో అందరి దృష్టిలోను పడ్డాడు.

తర్వాత ‘జాంబి రెడ్డి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ తన రెండవ సినిమా ‘హనుమాన్’ తో ఏకంగా మూడువందల కోట్ల కలక్షన్స్ హీరోగా మారిపోయాడు. ఈమూవీ ఘనవిజయం తరువాత ఈ యంగ్ హీరో తనకు ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తాను ఇప్పటికే ఒప్పుకున్న ఒక సినిమాను పూర్తి చేసే విషయంలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పేరు ‘మిరాయ్’ ‘ఈగల్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతోంది.  

‘మిరాయ్’ అనేది జపనీస్ వర్డ్. ఇదొక యాక్షన్ మూవీ అని అంటున్నారు. ఈమూవీలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ‘ఈగల్’ ను నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థ ఈమూవీని నిర్మిస్తోంది. అయితే ‘హనుమాన్’ మూవీతో తేజ సజ్జా మార్కెట్ బాగా పెరిగిపోవడంతో ఈమూవీ బడ్జెట్ కు సంబంధించిన ప్రణాళికలు మార్చి ప్రస్తుతం ఈమూవీ పై 40 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో తేజ పక్కన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సంవత్సరంలోనే ఈమూవీ రిలీజ్ ఉంటుంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: