పుష్ప : పాటలు హిట్ కానీ?
ఇరు తీరాల్లో దేనికి సొంతం కాను
ఇదీ పాట.. ఎంత గొప్పగా రాయించారో
వనమాలి అనే సినీ కవి రాశారీ పాట.. ఇంత మంచి స్థాయిలో రంగ స్థలంలో కానీ ఇప్పుడు పుష్పలో కానీ పాటలు లేవు గాక లేవు. ఇకపై ఆ స్థాయిలో పాటలు ఆశించడం అనుభవించడం ఆస్వాదించడం అన్నవి జరగని పని! కానీ మ్యూజిక్కు జిమ్ముక్కుల పరంగా ఈ సినిమా పాటలకు వేల మిలియన్ వ్యూస్ రావొచ్చు.. అయితే ఓ గొప్ప సాహిత్యానికి మిలియన్ వ్యూసే ప్రామాణికమా?? అంతకుమించి ఏం ఆశించలేమా నేర్చుకోలేమా అన్నదే ఓ పెద్ద సంశయం.
సుక్కూ సినిమాల్లో పాటలే ఓ ప్రత్యేకం. వేటూరి రాసినా సిరివెన్నెల రాసినా ఆ పాట స్థాయిని పెంచేలానే రాశారు. గతంలోనూ చంద్రబోస్ సుక్కూ సినిమాలకు పాటలు రాశారు. ఇప్పుడూ రాశారు. అయితే పాట సాహిత్య స్థాయి మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. వాటిలో ఉన్నత విలువలు అయితే లేవు. మరో పదేళ్లు ఈ పాట గురించి మాట్లాడుకోవచ్చు అన్న స్థాయిలో అస్సలు లేవు గాక లేవు. కానీ చంద్రబోస్ మాత్రం వేదికపై తనదైన ప్రసంగం చేసి ఈ పాటలకు ఓ గొప్ప ప్రామాణిక ధోరణి ఉందని చెప్పుకోవడం వింతల్లోకెల్లా వింత. ఏదయినప్పటికీ వినగానే నచ్చేసే ధోరణిలో రాసే పాటలివి.. అంతకుమించి సినిమాకు మించి ఈ పాటలు మరో పదేళ్లు వినిపిస్తాయి అని అనుకోవడమే అవివేకం.
అడవి నేపథ్యంలో వచ్చిన కథలు చాలానే ఉన్నాయి కానీ ఈ సినిమా వాటి స్థాయిని పెంచేలానే ఉంటుందని అంటున్నారు సుక్కూ.
పాటలు కూడా కథను మోసుకుని వెళ్తాయని అంటున్నారు చంద్రబోస్. మొత్తం ఐదు పాటల్లో కూడా ఎక్కడా బోరెత్తించకపోవడం
అన్నది వీటి ప్రత్యేకత అని చెబుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ. ఇలా ఎవరి వాదన వారు సినిమా పరంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన పాటలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నాయి. లిరికల్ వాల్యూస్ పెద్దగా లేకపోయినా కూడా ట్యూన్ నడక ఆధారంగానే అవి మంచి పేరు తెచ్చుకున్నాయన్నది ఓ వాస్తవం. దీంతో ఈ పాటలు మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి కానీ వాటికి లిరికల్ వాల్యూస్ మాత్రం అంతగా లేవనే విమర్శ ఉంది. గతంలో వచ్చిన పాటలు కన్నా ఇవేవీ పెద్ద గొప్పవి కాకున్నా సింగర్స్ వాటిని మరో స్థాయికి తీసుకుని పోవడంలో ఎంతగానో కృషి చేశారన్నది ఓ వాస్తవికం.