'మా'పోరు: ప్రకాశ్‌రాజ్‌.. ఆ 4 కుటుంబాలతో ఢీ..?

Chakravarthi Kalyan
మా ఎన్నికలకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉండటంతో విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. అయితే.. ప్రకాశ్‌రాజ్‌ టాలీవుడ్‌లోని నాలుగు కుటుంబాలను సవాల్ చేస్తున్నాడా.. పెద్దలతో ఢీ కొంటున్నాడా అన్న విమర్శలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. తనకు పెద్దల సహకారం అవసరం లేదని.. పెద్దల సహకారంతో గెలిస్తే.. వాళ్ల కాళ్ల దగ్గర కూర్చోవాలని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

క్రమంగా ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడు సినీ పరిశ్రమలోని పెద్దల కుటుంబాలు మంచు విష్ణుకు అనుకూలంగా మారబోతున్నాయా అన్న చర్చ కూడా మొదలైంది. ప్రకాశ్ రాజ్ నేరుగా మోహమాటం లేకుండా సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాలపై ఘాటుగా వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. అంతే కాకుండా మంచు విష్ణు చేస్తున్న విమర్శలు కూడా అలాగే ఉంటున్నాయి. 'మా' ఎన్నికల్లోకి నా కుటుంబాన్ని ఎందుకు తెస్తారంటున్న మంచు విష్ణు.. ఇకపై తన కుటుంబం పేరెత్తితే ప్రకాశ్‌రాజ్‌కు మర్యాద ఉండదంటున్నారు.

అంతే కాదు. పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అవుతారని.. నడిగర సంఘంలో అడిగితే ప్రకాశ్‌రాజ్ నిజస్వరూపం తెలుస్తుందని అన్నారు. ప్రకాశ్‌రాజ్ మా ఇంటినీ రెండుగా విభజిస్తున్నారని.. పెద్దా, చిన్నా చూడకుండా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతున్నారని.. ప్రకాశ్‌రాజ్‌ మగాడైతే, దమ్ముంటే.. నన్ను ధైర్యంగా ఎదుర్కోవాలని సవాల్ విసురుతున్నారు. ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ యత్నిస్తున్నారని విష్ణు ఆరోపిస్తున్నారు. ఈ నెల మా ఎన్నికలయ్యాక 11న ప్రకాశ్‌రాజ్ విమానమెక్కి వెళ్లిపోతారని కానీ.. జీవిత, శ్రీకాంత్.. అందరం ముఖం చూసుకోవాలని మంచు విష్ణు అన్నారు.

మొత్తానికి ప్రకాశ్  రాజ్ సినీ పెద్దలను సవాల్ చేస్తున్నాడన్న టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మరి దీనిపై పరిశ్రమ ఎలా స్పందిస్తుందో.. ఎవరి వాదన నెగ్గుతుందో.. 11వ తారీఖున కానీ తెలియదు. నేను మోనార్క్‌ అని అనే ప్రకాశ్‌రాజ్ మా ఎన్నికల్లో విజయం సాధిస్తారా.. అన్నది ఉత్కంఠభరితంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: