బండ్ల గణేష్ ను మరింత రెచ్చ కొడుతున్న పవన్ అభిమానులు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ వీరభక్తుడు బండ్ల గణేష్‌ కు పవన్ పేరు చెపితే చాలు పూనకంతో ఊగిపోతాడు. సినిమా ఫంక్షన్స్ లో స్టేజ్ ఎక్కినా మీడియా ముందు మాట్లాడినా పవన్ విషయమై తన భావోద్వేగాన్ని ఆపుకోలేడు. బండ్ల గణేష్ పవన్ పై చేసే పొగడ్తలకు జనం నవ్వుకుంటున్నా అతడు పట్టించుకోడు.

ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్ కోసం ఓంకార్ నిర్వహిస్తున్న గేమ్ షోలో పాల్గొన్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘ఈశ్వరా పరమేశ్వరా పవనేశ్వరా నాదేవారా’ అంటూ పెద్ద స్తోత్రమే చేసాడు. ఈమధ్యనే ప్రసారం అయిన ఆ షోకు మంచి రేటింగ్స్ కూడ వచ్చాయి అని అంటున్నారు.

ఆ కార్యక్రమం ప్రసారం అయి వారం రోజులు గడవకుండానే పవన్ అభిమానుల నుండి బండ్ల గణేష్ కు ఒక సూచన వచ్చింది. ‘దేవర’ అన్న టైటిల్ తో పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి మూవీ తీస్తే ఆమూవీ ‘గబ్బర్ సింగ్’ కన్నా భారీ హిట్ అవుతుందని అభిమానులు బండ్ల గణేష్ ను రెచ్చకొట్టారు. ఈ సూచనకు పొంగిపోయిన బండ్ల గణేష్ తాను త్వరలో ఈ టైటిల్ ను రిజస్టర్ చేసి ఈ టైటిల్ కు అనుగుణంగా ఒక మంచి కథ రాయించడానికి ప్రయత్నిస్తాను అంటూ సంకేతాలు ఇచ్చాడు. దీనితో పవన్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోయారు.

పవన్ రాజకీయాల నుండి మళ్ళీ సినిమాల వైపు రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. దీనికోసం ఈమధ్య ఇతడు పవన్ ను కలిసినట్లుగా వార్తలు కూడ వచ్చాయి. కానీ ఎందుకనో పవన్ బండ్ల గణేష్ అభ్యర్ధన పై స్పందించకుండా కాలం గడుపుతున్నట్లు టాక్. అయితే బండ్ల గణేష్ పట్టు విడవకుండా అవకాశం చిక్కినప్పుడల్లా తన ప్రయత్నాలు కొనసాగిస్తూ పవన్ తో మూవీ చేయడమే తన జీవిత ధ్యేయం అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: