మాస్టర్ మ్యానియాతో హోరెత్తి పోతున్న చెన్నై !
కోలీవుడ్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్ కు సంక్రాంతి సీజన్ చాల ప్రత్యేకమైంది. దీనితో టాప్ హీరోల సినిమాలు అన్ని ఈ సీజన్ పైనే దృష్టి పెడతాయి. అయితే ఈసారి కోలీవుడ్ లో పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి. విజయ్ ‘మాస్టర్’ మ్యానియాకు భయపడి ఈసారి సంక్రాంతికి మరి ఏ సినిమా విడుదల కావడంలేదు. దీనితో చెన్నైలోని థియేటర్స్ అన్ని విజయ్ ‘మాస్టర్’ సినిమాతో నిండబోతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ స్థానం ప్రత్యేకం అన్నవిషయం తెలిసిందే. విజయ్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఫస్టు లుక్ వదిలిన దగ్గర నుంచి సినిమా హిట్ అనిపించుకునేంత వరకూ విజయ్ అభిమానుల హంగామా కొనసాగుతూనే ఉంటుంది. సాధారణంగా విజయ్ సినిమా రిలీజ్ ఉందంటే చాలా సినిమాలు ఆతరువాతనే రిలీజ్ కి ముహూర్తం పెట్టుకుంటాయి.
ఈసారి కూడ అందరి హీరోల సినిమాలు విజయ్ మాస్టర్ కు లైన్ క్లియర్ చేయడంతో చెన్నైలో ఎక్కడ ఏ థియేటర్లో చూసినా విజయ్ సినిమానే ఈసారి అక్కడి సంక్రాంతికి సందడి చేయబోతోంది. విజయ్ మ్యానియాతో పాటు విజయ్ సేతుపతి ఈసినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తూ ఉండటంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ మరింత పెరిగి పోయింది. మూడు భారీ హిట్ల తరువాత విజయ్ చేసిన సినిమా కావడంతో అభిమానులంతా ఈసినిమా కోసం మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ టేకింగ్ ఒక ఎత్తు ఆయన స్క్రీన్ ప్లే మరో ఎత్తు. ఒక కథను ఎక్కడి నుంచి ఎలా మొదలుపెట్టాలో ఎలా ట్విస్టులతో ఆకధను క్లైమాక్స్ కు తీసుకు రావాలో అతడికి బాగా తెలుసు. దీనికి ఉదాహరణ ఆమధ్య విడుదలైన కార్తి ‘ఖైదీ’ స్క్రీన్ ప్లే ఆధారంగానే ఆమూవీ సూపర్ హిట్ అయింది. దీనితో ‘మాస్టర్’ సినిమాకి కూడ లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ స్క్రీన్ ప్లే ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఈమూవీ కూడ తెలుగులోకి డబ్ చేసి సంక్రాంతికి వస్తున్న పరిస్థితులలో ‘క్రాక్’ ‘రెడ్’ ల కలెక్షన్స్ కు కొంతవరకు మాస్టర్ చెక్ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు..