ఆ రెండూ చూసి భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానంటున్న వెంకటేష్..

Deekshitha Reddy
రీఎంట్రీ తర్వాత చిరంజీవి పూర్తిగా భారీ సినిమాలకు ఫిక్స్  అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ లో ఉండే సినిమాలే తీస్తానంటున్నారు. దర్శకులను కూడా అలాగే సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇక నాగార్జున డిఫరెంట్ జానర్ లో వెళ్తున్నారు, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ.. కొడుకుల కెరీర్ పై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. బాలకృష్ణ మాత్రం ఎలాంటి కండిషన్లు పెట్టుకోకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరో అగ్రహీరో వెంకటేష్ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. రాబోయే రెండు సినిమాలతో తన భవిష్యత్ కెరీర్ ని డిసైడ్ చేస్తానంటున్నారు వెంకటేష్.
చంటి లాంటి సినిమాలయినా, సరదాగా సాగిపోయే.. నువ్వునాకు నచ్చావ్ లాంటి సినిమాలయినా వెంకటేష్ కి కొట్టినపిండి. అయితే ఇప్పుడు ఎంటర్టైన్ మెంట్ కే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇటీవల వెంకటేష్ చేసిన ఎఫ్-2 సినిమానే దీనికి ఉదాహరణ. భారీ చిత్రాలను సైతం తలదన్ని ఎఫ్-2 కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. అయితే వెంకటేష్ అదే జానర్ లో వెళ్లాలా లేక, స్టైల్ మార్చాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ప్రస్తుతం వెంకీ నారప్ప అనే ఊర మాస్ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ రీమేక్ మూవీలో పూర్తిగా డీ గ్లామర్ పాత్ర పోషిస్తున్నారు వెంకటేష్. ఇది వర్కవుట్ అయితే ఇకపై అలాంటి పాత్రలు కూడా చేస్తారట. ఒకవేళ.. ఆ ప్రయోగం దెబ్బకొడితే.. వెంటనే ఎఫ్-3 లైన్లో ఉంది. ఎఫ్-3 సినిమా సక్సెస్ రిపీట్ చేస్తే.. ఇకపై పూర్తిగా వెంకటేష్ ఎంటర్టైన్ మెంట్ కే ఫిక్స్ అవువతారట.
ఎఫ్-3 సినిమా స్క్రిప్ట్ వర్క ఇటీవలే పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఫైనల్ స్క్రిప్టుకి వెంకీ.. వరుణ్ తేజ్ ఇద్దరూ ఓకే చెప్పారట. డిసెంబరు 14న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మొదటి షెడ్యూల్ లోనే ఇద్దరు హీరోలు పాల్గొంటారని చెబుతున్నారు. దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. వచ్చే వేసవి నాటికి ఈ సినిమా థియేటర్లలోకి  తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: