కరోనా ఎఫెక్ట్ : తమిళనాట ఆగిపోయిన సీరియల్స్ షూటింగ్?

siri Madhukar

దేశంలో కరోనా మహమ్మారి ఫిబ్రవరి నెల నుంచి మొదలైంది. ఆ తర్వాత ఒక్కో కేసు పెరుగుతూ దేశం మొత్తం వ్యాప్తి చెందింది.  దాంతో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి థియేటర్లు, మాల్స్, వైన్స్, బార్లు, విద్యా వ్యవస్థలు, దేవాలయాలు అన్నీ మూసివేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా సినీ పరిశ్రమకే పడింది. లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ మొత్తం నిలిపివేశారు. బుల్లితెర సీరియల్స్ కూడా మొత్తం ఆపివేశారు. దాంతో ఎంతో మంది కళాకారులు కష్టాల్లో పడ్డారు.  ఇక సినీ ప్రపంచాన్ని నమ్ముకున్న ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు.  వారిని ఆదుకోవడానికి సినీ పెద్దలు ముందుకు రావడం వారికి కష్టకాలంలో తినడానికి సరిపడ నిత్యావసరాలు, డబ్బులు సహాయం అందించారు.

 

ఈ మద్య షూటింగ్స్ జరుపుకోవొచ్చని పలు ప్రభుత్వాలు తెలిపాయి.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కూడా ఉన్నాయి.  తమిళనాట వెండి, బుల్లితెర షూటింగ్స్ జరుపుకోవడానికి సీఎం పళని స్వామి అనుమతి ఇచ్చారు. పెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి (వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త), బుల్లితెర కళాకారుల సంఘం నిర్వాహకురాలు ఖుష్బూ తదితరులు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి షూటింగులకు అనుమతిని సాధించారు.

 

బుల్లితెర షూటింగ్స్ వారం రోజుల పాటు సాఫీగానే కొనసాగాయి.. కానీ తమిళనాట ముఖ్యంగా చెన్నైనలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే.  దేశంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లో కరోనా కేసులు, మరణాలు బాగా పరిగిపోయాయి. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో, చెన్నై సహా కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈనెల 19 నుంచి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించారు. దీంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కరోనా కేసులు కంట్రోల్ అయ్యేవరకు ఇక్కడ లాక్ డౌన్ కొనసాగించే యోచనలో ఉన్నారట. ఈ నెలాఖరు వరకు ఈ జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించడంతో టీవీ సీరియల్స్ షూటింగులు నిలిచిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: