రాశిపెట్టి ఉన్నా..షాకులే ఖన్నా ?
రాశీ ఖన్నా.. అందగత్తె అని వేరేగా చెప్పనక్కేరలేదు. ఇప్పటి సినిమాలకు తగిన అభినయం కూడా ఉంది. యువ గుండెలను గిలిగింతలు పెట్టే చిలిపితనం చాలానే ఉంది. యంగ్ హీరోల పక్కన చలాకీగా డ్యాన్సులు చేస్తూ కవ్విస్తూ నవ్విస్తూ ముద్ద మందారంలా విరబూసే విరిబోణి రాశి. ఆమెను తలచుకుంటే ఊహలు గుసగుసలాడుతాయి. ఆమెను వెండితెర మీద చూసి గుండె తెర మీద అంటించుకున్న కుర్ర కారుకూ లెక్కలేదు.
అటువంటి రాశి ఒక దశలో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు దూకుడు చేసింది. ఆమెకు సుడి కలసి రావడంతో అప్పట్లో వరసగా చాన్సులు వచ్చిపడ్డాయి. పెద్ద హీరోల పక్కనే నటించింది. జై లవకుశలో జూనియర్ ఎన్టీయార్ తో కలసి స్టెప్పులేసింది. ఇక దశ తిరిగింది అనుకుంటూండగా ఆలా ఒక్కసారిగా మిడిల్ డ్రాప్ అయిపోయింది.
వెనకాల వచ్చిన రష్మిక ముందు సీట్లోకి వచ్చేసింది. ఆమె ఎకాఎకిన స్టార్ హీరోయిన్ చాన్స్ పట్టేసింది. ఆమె సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ బ్లాక్ బస్టర్ హిట్లు అయి కూర్చున్నాయి. దాంతో ఆమె జూనియర్ ఎన్టీయార్ మూవీతో పాటు అల్లు అర్జున్ మూవీలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది.
మరి రాశి మాత్రం అక్కడే ఉండిపోయింది. వెంకీ మామ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే వరల్డ్ ఫ్యామస్ లవర్ పెద్ద డిజాస్టర్ అయింది. దాంతో రాశీకి చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ఇపుడు ఏం చేయాలి అన్నది ఈ ముద్దుగుమ్మకు పట్టుకున్న చింతట. అందం ఉంది. నటన ఉంది. కానీ అద్రుష్టం లేదని తాపీగా రాశీ బాధపడుతోందిట. నిజమే ఏదైనా రాశిపెట్టి ఉండాలి. లేకపోతే అవకాశాలు రాశిగా పోసి వచ్చినా రాణించలేమనడానికి రాశీఖన్నా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటున్నారు. అమ్మడి సిరి ఇలాగేనా.. లేక సీన్ మారుతుందా చూడాలి.