గత ఏడాది ఎఫ్ 2 అలాగే గద్దల కొండ గణేష్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు మెగా హీరో వరుణ్ తేజ్. అందులో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 అయితే బాక్సాఫీస్ వద్ద 80కోట్ల వసూళ్లను రాబట్టి వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటించాడు.
ఈచిత్రం తరువాత వరుణ్ ఇటీవల గద్దల కొండ గణేష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం తో మొదటి సారి ఊర మాస్ పాత్రలో నటించి వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత వరుణ్ తేజ్ 10వ చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేయనున్నాడు. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాక్సర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం లో కూడా వరుణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.
ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా బాక్సర్ నుండి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఈ పోస్టర్ లో వరుణ్, గ్లోవ్స్ ధరించి సీరియస్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మించనున్నాడు. తమన్ సంగీతం అందించనున్నాడు. ఈఏడాది ద్వితీయార్థం లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.