బోయపాటి నా భార్యతో అలా మాట్లాడొచ్చా..! మండిపడ్డ పోసాని..!

Chakravarthi Kalyan
డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి విరుచుకుపడ్డారు. ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నతన పట్ల బోయపాటి చాలా అనుచితంగా ప్రవర్తించాడని ఓ టీవీ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని మురళీకృష్ణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరున్న రచయిత.. ఆయన వద్ద పనిచేసిన ఎందరో ఆ తర్వాత పెద్దస్థాయికి చేరుకున్నారు.



త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సంపత్ నంది, బోయపాటి శ్రీను వంటి దాదాపు 30 మంది వరకూ తన వద్ద పనిచేశారని పోసాని చెబుతుంటారు. వారందరూ ఇప్పటికీ తనతో మంచిగా ఉంటారని పోసాని చెప్పారు. అదే సమయంలో బోయపాటి శ్రీను ప్రవర్తనపై నిప్పులు చెరిగారు. పోసాని ఏమన్నారో ఆయన మాటల్లోనే..

"బోయపాటి శ్రీను అనే డైరెక్టర్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. చిన్న పూరి గుడిసె నుంచి వచ్చాడు. బోయపాటి వాళ్ల నాన్న మా ఊరి ముస్లిం దర్గాలో వాచ్ మెన్‌గా పని చేస్తుండేవాడు. వాళ్ల అన్న చిన్న ఫోటో స్టూడియో నడిపేవాడు. ఆయన తన తమ్ముడికి హైదరాబాద్‌లో ఏదో ఉపాధి చూపించమని బతిమాలితే హైదరాబాద్ తీసుకొచ్చా..

ముత్యాల సుబ్బయ్య వద్దకు బోయపాటిని తీసుకెళ్లి అసిస్టెంట్‌ గా చేర్చా.. దాదాపు పదేళ్లపాటు బోయపాటి ముత్యాల సుబ్బయ్య వద్ద పని చేశారు. ఓ రోజు.. బోయపాటి బిడ్డకు జబ్బు చేసి ఆసుపత్రికి డబ్బు లేక ఏడుస్తుంటే.. నేను కారు ఇచ్చి వైద్యానికి పంపి.. సొంత డబ్బుతో వైద్యం చేయించా.



అలాంటి బోయపాటి.. నా సినిమా శ్రావణమాసం ఫ్లాప్ అయినప్పుడు మా ఇంటికొచ్చి మా ఆవిడతో చాలా చిల్లరగా మాట్లాడాడు. వదినా.. అన్నయ్య డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ కాదు.. కదా.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది. మేమంటే డైరెక్టర్లం.. మరి ఇప్పుడు ఇన్యూరెన్సు బిల్లులు..ఇతర ఖర్చులు ఎలా కడతారు.. అన్నాడు.



బోయపాటి సానుభూతితో మాట్లాడలేదు. యారొగాన్స్‌ తో మాట్లాడాడు. నా భార్య ఉన్నత విద్యావంతురాలు కాబట్టి ఎక్కువగా ఫీల్ కాలేదు. కానీ అలా బోయపాటి మాట్లాడొచ్చా.. త్రివిక్రమ్, సంపత్‌ నంది.. ఇలా ఎవరూ మాట్లాడలేదే.. ఇది చీప్ బిహేవియర్ కాదా..” అంటూ పోసాని బోయపాటి తీరును ఎండగట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: