నయనతారకు, తన ప్రస్తుత ప్రియుడు ఆర్య కు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ వార్త దానికి సంబంధించింది అనుకుంటున్నారా...? అలా అనుకుంటే మీరు ఉహించుకోనేది తప్పు. ప్రస్తుతం నయన్ బాలీవుడ్ ‘కహాని’ రీమేక్ ‘అనామిక’ లో నటిస్తోందన్న విషయం తెలిసిందే. పేరుకు ఈ సినిమాను రీమేక్ సినిమాగా తీస్తున్నా, దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం ఈ సినిమాలో చాలా మార్పులూ, చేర్పులూ చేశాడని వార్తలు వస్తున్నాయి. కహాని లో విద్యాబాలన్ పాత్ర నిండు గర్భిణి. తన భర్తను వేతుక్కుంటూ విదేశాల నుంచి ఇండియా తిరిగి వస్తుంది. కాని మన తెలుగు రీమేక్ లో మాత్రం నయనతార నిండు గర్భిణి గా కనిపించదట. దీనికి ప్రధాన కారణం ఆ గెటప్ నయన్ కు సూట్ కాలేదట.అందువల్ల ఈ మార్పులు దర్శకుడు శేఖర్ కమ్ముల చేశాడనే వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు కహాని సినిమాలో కనిపించి,కనిపించకుండా ఉండే విద్యాబాలన్ భర్త పాత్రను మన తెలుగు సినిమా ‘అనామిక’ లో చాలా పెంచాడట మన క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. కహాని సినిమా అంతా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నడిస్తే, అనామిక మాత్రం భాగ్యనగరం బ్యాక్ డ్రాప్ లో నడుస్తోందట. ప్రముఖ రచయిత ఎండమురి వీరేంద్రనాథ్ సహకారం తో ఒరిజినల్ కహాని సినిమాకు చాలా మార్పులు చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. సామాన్యంగా తన సినిమాకు తానే స్క్రీన్ ప్లే రాసుకొనే శేఖర్, ఈసారి మరో రచయిత సహకారం తీసుకోవడం టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది.
అంతేకాదు చాలా నెమ్మదిగా సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఈ సినిమాను చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 70% చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా దసరా పండుగకు తీసుకువచ్చి మరో రికార్డు ను క్రియేట్ చెయ్యాలని శేఖర్ ఆలోచిస్తున్నాడట. సామాన్యంగా రీమేక్ ల జోలికి వెళ్ళని శేఖర్ కమ్ముల మొట్టమొదటి సారిగా రీమేక్ చేయడం అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా ఈ సినిమాను తనదైన బాణిలో ఎలా ప్రెసెంట్ చేస్తాడా..? అనే ఆత్రుత టాలీవుడ్ ప్రేక్షకులలో ఉంది.