జగన్ వద్దకు వెళ్ళే పెద్ద ఎవరు... ?

Satya
టాలీవుడ్ అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ మీద బాగా ఇష్యూ అవుతోంది. దానితో పాటు బెనిఫిట్ షోల రద్దు ఫస్ట్ టూ వీక్స్ కి హైపర్ రేట్లతో కలెక్షన్లు కొల్లగొట్టే చాన్స్ బడా హీరోలకు లేకపోవడం అంటే మాత్రం టాలీవుడ్ కి గట్టిగానే దెబ్బ తగిలుతోంది.
నిజానికి టాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేటు బాగా తగ్గిపోయింది. గతంలో పదిహేను నుంచి ఇరవై శాతం ఉంటే ఇపుడు అయిదు శాతం కూడా లేదు. ఇక బడా హీరోలు, జనాలు మెచ్చే వారు ఉంటే వారి సినిమాలకే అధిక ధరలు పెట్టి ఫ్యాన్స్ అయినా సాదా జనం అయినా వస్తారు. ఇపుడు ఏపీ సర్కార్ ఆన్ లైన్ టికెటింగ్ అంటే మాత్రం కచ్చింతంగా పెద్ద సినిమాలు దెబ్బ తింటాయి. చిన్న సినిమాలు ఏనాడో వెనక్కిపోయాయి. ఆన్ లైన్ టికెటింగ్ వల్ల చిన్న సినిమాలకు మేలు జరుగుతుంది అని అనుకున్నా కూడా వాటి కోసం థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కూడా తగ్గిపోయారని సర్వేలు చెబుతున్నారు.
థియేటర్లలో సినిమా చూసే వారి శాతం ఏ ఏటికి ఆ ఏడు పడిపోతోంది. అదే టైమ్ లో ఆల్టర్నేషన్ గా ఎన్నో కొత్తవి వచ్చేశాయి. టెక్నాలజీ ముందు థియేటర్లు బోసిపోతున్నాయి. దాంతో ఇపుడు టాలీవుడ్ పుట్టెడు కష్టాల్లో ఉంటే ఆన్ లైన్ టికెటింగ్ ఏంటి అన్న బాధ అయితే ఉంది. కానీ వద్దు అని ఎవరూ బయటకు చెప్పలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ అయితే దీని మీద డేరింగ్ గా మాట్లాడారు, ఆయన నిజాలే చెప్పారు, కానీ ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత కావడం వల్ల పొలిటికల్ కలరింగ్ దీనికి వచ్చేసింది. టాపిక్ కూడా పక్క దోవ పట్టేసింది.
ఇక ఈ మధ్యలో మా ఎన్నికలు జరగడంతో టాలీవుడ్ లో కొంత విభేదాలు కూడా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. మా కొత్త ప్రెసిడెంట్ విష్ణు మీదనే ఇపుడు ఈ భారం పెడుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. అదే టైమ్ లో గతంలో జగన్ వద్దకు టాలీవుడ్ పెద్దగా వెళ్ళిన చిరంజీవి ఇపుడు చొరవ తీసుకుంటారా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అయితే ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు, అందరిదీ కాబట్టి టాలీవుడ్ పెద్దలు అంతా కలసి ఏపీ సీఎం జగన్ని కలసి పరిష్కరించుకోవాలని అంటున్నారు. లేకపోతే ఒక్కో పెద్ద సినిమా రిలీజ్ వాయిదాలు వేసుకుంటూ ఆలా ముందుకు పోవడమే తప్ప ఉపయోగం ఉండదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: