పాపులర్ ఓటిటికి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ ?

Vimalatha
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాపులర్ ఓటిటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారట. దాదాపు అన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు ప్రేక్షకుల కోసం ఇప్పటి నుండి ప్రత్యేకమైన తెలుగు కంటెంట్‌ని తీసుకురావాలని యోచిస్తున్నాయి. తద్వారా ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులను తమ తమ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రైబ్ అయ్యేలా చూడాలనేది వారి ఆలోచన. లాక్ డౌన్ సమయం నుంచి ఓటిటి వేదికల ఆలోచనలు మారాయి. ఎందుకంటే ఇంతకు ముందు తెలుగు పేక్షకులు ఎక్కువగా ఓటిటి కంటెంట్ ను వీక్షించేవారు కాదు. అయితే కరోనా పుణ్యమాని అందరూ ఇప్పుడు ఓటిటికి బాగా అలవాటు పడ్డారు. అయితే తెలుగు వాళ్లకు ఈ టాప్ ఓటిటి సంస్థలు ప్రాముఖ్యత ఇవ్వకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మనోళ్లు సెగ గట్టిగా తగలడంతో దిగ్గజ ఓటీటీలు దిగొచ్చి తెలుగు ప్రేక్షకుల కోసమే ప్రత్యేకంగా సరికొత్త ప్లన్స్ చేస్తున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయించడంతో, ఇప్పటికే తెలుగు ఓటిటి "ఆహా" వారి యాప్‌ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలను నిలబెట్టింది.
దీంతో తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు వెర్షన్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా హీరోను సంప్రదించిందట. అయితే ఈ పాపులర్ ఓటిటి సంస్థను ప్రమోట్ చేయడానికి చరణ్ కూడా సిద్ధంగా ఉన్నాడట. చరణ్ హాట్ స్టార్‌ కు సంబంధించిన రెండు వీడియో యాడ్స్, ప్రింట్ యాడ్స్‌లో ప్రాతినిధ్యం వహించడానికి పే ప్యాకేజీగా దాదాపు 3 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హాట్‌స్టార్ అంచనా ప్రకారం ఈ డీల్ ఒక ఏడాది పాటు కొనసాగినా, తెలుగు రాష్ట్రాలలో చరణ్ క్రేజ్ కారణంగా డిస్నీ కుటుంబంలో చేరడానికి మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఆకర్షితులవుతారని అంచనా వేస్తున్నారు.
అలాగే హాట్‌స్టార్ ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో సహా అనేక తెలుగు ఒరిజినల్స్ రూపొందించడంపై దృష్టి సారించింది. "ఆర్ఆర్ఆర్" విడుదలవుతున్న సమయంలో చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో డిస్నీ వైపు ఎక్కువ మందిని ఆకర్షితులు అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ సూపర్. ఈ గ్లోబల్ డిజిటల్ కంటెంట్ దిగ్గజం ప్లాన్ ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: